రుచిక కేసు దోషికి అంత గౌరవమా? | Ruchika Case Convict shares dais at R Day function | Sakshi
Sakshi News home page

Jan 28 2018 2:34 PM | Updated on Jan 28 2018 2:34 PM

Ruchika Case Convict shares dais at R Day function  - Sakshi

రుచికా గిర్‌ హోత్రా (ఫైల్‌ ఫోటో)

పంచకుల : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘రుచిక లైంగిక వేధింపుల కేసు’లో దోషి, హరియాణా మాజీ డీజీపీ ఎస్పీఎస్‌ రాథోడ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచకులలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నాడు. ఉన్నతాధికారులతో సహా ఆయన స్టేజీ పంచుకోవటంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. 

లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవించిన ఆయన.. పోలీస్‌ అధికార కార్యక్రమాలకు మాజీ హోదాలో కూడా హాజరుకాకూడదన్న ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని ఆయన ఉల్లంఘించారు. అధికారులు కూడా ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా వేదిక మీదకు ఆయన్ని ఆహ్వానించారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఇది జాతీయ జెండాకు అగౌరవమేనని రుచికా స్నేహితురాలు, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఆరాధన గుప్తా చెబుతున్నారు. నేరస్థులకు ప్రభుత్వం ఇంత గౌరవం ఇవ్వటమేంటని?’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రుచిక తల్లి కూడా ఇది రాజ్యాంగాన్ని అవమానపరచటమేనని చెబుతున్నారు. హరియాణాలో ఈ మధ్య  మహిళలపై అకృత్యాలు పెరిగిపోయిన నేపథ్యంలో... ఈ వ్యవహారం ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారింది.

కేసు పూర్వాపరాలు... 1990లో పోలీస్‌ ఉన్నతాధికారిగా ఉన్న ఎస్పీఎస్‌ రాథోడ్‌... హరియాణా టెన్సిస్‌ అసోషియేషన్‌ ప్రధానాధికారిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో తన కూతురి క్లాస్‌ మేట్‌ అయిన రుచికా గిర్‌ హోత్రా అనే పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. అక్కడి నుంచి రాథోడ్‌ తన అధికారంతో రుచికా కుటుంబాన్ని కష్టాలకు గురిచేశాడు. రుచికను స్కూల్‌ నుంచి సస్పెండ్‌ కావటం.. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోవటం... కేసును వాదించిన న్యాయవాదికి చిక్కులు, ప్రత్యక్ష సాక్షి అయిన రుచిక స్నేహితురాలు ఆరాధాన కుటుంబానికి వేధింపులు.. చివరకు 13 ఏళ్ల రుచిక సోదరుడిని దొంగతనం కేసుల్లో అక్రమంగా ఇరికించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు. 

ఈ పరిణామాలను తట్టుకోలేక రుచిక 1993లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పత్రికల కథనాలను పరిగణనలోకి తీసుకుని సుమోటోగా కోర్టు కేసును స్వీకరించి సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ సమయంలోనే ఆయన హరియాణా డీజీపీ(అదనపు)గా బాధ్యతలు స్వీకరించటం చర్చనీయాంశమైంది. 19 ఏళ్లపాటు కొనసాగిన కేసు, 40 వాయిదాలు, 400 వాదనలు... చివరకు  2009లో రాథోడ్‌ను నిందితుడిగా తేల్చిన కోర్టు డీజీపీ బాధ్యతల నుంచి ఆయన్ని తొలగించాలని, ఆయనకిచ్చిన గౌవర పురస్కారాలను వెనక్కి తీసుకోవాలని హోం శాఖను ఆదేశిస్తూ...  ఆరు నెలల శిక్షతో సరిపెట్టింది. తర్వాత సీబీఐ కోర్టులో దీనిపై వాదనలు జరగ్గా.. ఆ శిక్షను ఏడాదిన్నరకు మారుస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2010లో కోర్టు విచారణకు హాజరై బయటకు వస్తున్న ఆయన్ని వారణాసికి చెందిన ఉత్సవ్‌ శర్మ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపబోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించటంతో రాథోడ్‌ బయటపడ్డాడు. రాథోడ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో ఆరేళ్ల విచారణ తర్వాత.. కోర్టు ఆయన్ని దోషిగా తేల్చి శిక్షలో 6 నెలల మినహాయింపు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement