గర్భసంచి రాకెట్‌ సూత్రధారి అరెస్టు | Sakshi
Sakshi News home page

గర్భసంచి రాకెట్‌ సూత్రధారి అరెస్టు

Published Wed, Jan 10 2018 9:39 AM

Rs.8 lakh per pregnant : mafia busted in vizianagaram - Sakshi

నాలుగు డబ్బులు వస్తే...పిల్లల పెళ్లిళ్లు చేయవచ్చనే ఆశతో పాటు...తమకు పనికిరాని గర్భసంచులు ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో నిరుపేద, అమాయక మహిళలు  ఓ కిలేడీ ఉచ్చులో పడిపోయారు.  గర్భసంచి ఇవ్వాలంటే పలు రకాల పరీక్షలు చేయించాలని నమ్మబలికి  వారి నుంచి సుమారు రూ.ఐదు లక్షల పైబడి దోచుకుంది. ఏడు నెలలుగా జరుగుతున్న  వ్యవహారాన్ని టూటౌన్‌ పోలీసులు గుట్టు రట్టు చేశారు.  అదుపులోకి తీసుకునే  సమయంలో విషయం తెలుసుకుని అక్కడ నుంచి పరారైన  మాయలేడిని ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో పట్టణ డీఎస్పీ ఎవి.రమణ  వివరాలను వెల్లడించారు.

విజయనగరం టౌన్‌: గర్భసంచులు ఇస్తే  ఒక్కొక్కరికీ  రూ.8 లక్షలు ఇస్తామంటూ సుమారు 15 మంది మహిళలను   విశాఖ జిల్లా భీమునిపట్టణం  మంగలి వీధికి చెందిన  సూరాడ ఆదిలక్ష్మి అలియాస్‌ జ్యోతి అనే మహిళ  మోసం చేసింది.  వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలంటూ  వారి నుంచి ఐదు లక్షల రూపాయలు పైబడి వసూలు చేసింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న జ్యోతి  గతంలో విశాఖలోని పలు ఆసుపత్రుల్లో స్వీపర్‌గా పని చేయడంతో పాటు చిన్నపాటి వైద్యం చేయడం నేర్చుకుంది.  దాన్నే ఆసరాగా తీసుకుని  అమాయక మహిళలను మోసం చేయడానికి  రంగం సిద్ధం చేసుకుంది. కమ్మవీధి, బూడివీధి, బొంగువీధిలో ఉన్న పలువురు నిరుపేద, నిరక్ష్యరాస్యులైన మహిళలను టార్గెట్‌ చేసుకుంది.  రూప, బూదేవి, సంతోషి, రాజీ, రమ తదితర మహిళలను ఒప్పించింది.  విషయం తెలుసుకున్న మరికొందరు మహిళలు తమ గర్భసంచిని ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు.

మొత్తం 15 మంది మహిళలతో గర్భసంచి అమ్మకాలు  చేయించి వారికి డబ్బులు ఇవ్వడానికి అంగీకారం కుదుర్చుకుంది.  వారికి  కొన్ని పరీక్షలు చేయాలని  ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు నుంచి లక్ష వరకూ వసూలు చేసింది. మొత్తం రూ.5 లక్షలకు పైబడి రాబట్టింది.  విశాఖలో  తాపీమేస్త్రీగా పని చేస్తున్న మేడిశెట్టి వెంకట శ్రీకాంత్‌ అనే వ్యక్తిని మహిళలకు వైద్యునిగా పరిచయం చేసింది. రాయపూర్‌ నుంచి ఇక్కడకు వచ్చారని, ఆరోగ్య స్తితి చూస్తారని వారికి   పలు రకాల పరీక్షలను దగ్గరుండి చేయించింది. ఈ నెల 2న బాధితురాలు భూదేవి ఇంటి వద్ద అందరితో సమావేశం నిర్వహిస్తున్న  విషయం కాస్త  పోలీసులకు సమాచారమందింది.  టూ టౌన్‌ పోలీసులు అక్కడకు వెళ్లేసరికి, అప్పటికే విషయాన్ని తెలుసుకున్న   మాయలేడి ఉడాయించింది.  బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో  కేసు నమోదు చేసిన పోలీసులు  మంగళవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద సెల్‌ డేటా ఆధారంగా జ్యోతి, శ్రీనివాస్‌లను  పట్టుకుని  అరెస్టు చేశారు.    కేసు చేధించడంలో కీలకపాత్ర పోషించిన ఎస్‌ఐ వి.అశోక్‌కుమార్, కానిస్టేబుల్లు సిహెచ్‌.అనిల్‌ శ్రీనివాస్, బలరామ్ను డీఎస్పీ అభినందించారు.  సమావేశంలో టూటౌన్‌ సీఐ బివిజె.రాజు  పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement