ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?

That Rs 50 lakhs money belongs to Hawala? - Sakshi

మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు?

ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌పై ఈడీ ప్రశ్నలవర్షం

చాలా ప్రశ్నలకు గుర్తులేదు, తెలియదంటూ బదులిచ్చిన రేవంత్‌

నేడు మరోసారి ఈడీ ముందుకు...

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ–1 నిందితుడైన రేవంత్‌రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు విచారించి ప్రశ్నలవర్షం కురిపించింది. ఉదయం 11.30కు ఈడీ కార్యాలయానికి హాజరైన రేవంత్‌ను రాత్రి 7.30 దాకా విచారించింది. ఈ వ్యవహారంలో హవాలా జరిగిందా అనే విషయాలపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారులు, ఉదయసింహాను విచారించిన ఈడీ.. వారి సమాచారం ఆధారంగా రేవంత్‌ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. రేవంత్‌ చెప్పే సమాధానాలను సరిపోల్చుకునేందుకు ఐటీతోపాటు గతంలో ఈ కేసును విచారించిన ఏసీబీ అధికారులు విచారణకు హాజరయ్యారు.

వారూ రేవంత్‌ను డబ్బు విషయంపై ప్రశ్నలు అడిగారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడ నుంచి సేకరించారు? ఎవరిచ్చారు? ఆ డబ్బు హవాలా డబ్బా? లేక స్థానికంగా ఎవరైనా సర్దుబాటు చేశారా? అనే విషయాలపైనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు? ఒకవేళ ఆ డబ్బు ముందుగానే సిద్ధం చేసి ఉంటే.. దాన్ని ఎవరి వద్ద ఉంచారు? అంత డబ్బు ఇచ్చేందుకు ఒకరే సహకరించారా? ఒకరికన్నా ఎక్కువమంది సహకరించారా? అనే విషయాలపై రేవంత్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. 

తెలియదు.. గుర్తులేదు.. 
ఈ కేసులో చాలా విషయాలకు రేవంత్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. చాలా ప్రశ్నలకు తనకు గుర్తులేదని, తెలియదని, మిగిలిన విషయాలు తన లాయర్‌ మాటాడతారని సమాధానమిచ్చారని తెలిసింది. రేవంత్‌కు సహకరించేందుకు పలువురు చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆయన వెంట వచ్చారు.  

ఇదంతా కక్ష సాధింపే: విచారణ అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ‘అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. రేపు కూడా రమ్మన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఐటీని పంపారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈడీని ప్రయోగిస్తున్నారు.  ఇది వరకే ఏసీబీ విచారణ పూర్తి చేసిన కేసుపై ఈడీ విచారణ ఎందుకు? నాపై పోటీ చేసిన నరేందర్‌రెడ్డి వద్ద రూ. 51 లక్షలు దొరికినా ఈడీ, సీబీఐకి ఎందుకు ఇవ్వడంలేదు.’అని రేవంత్‌ ఆరోపించారు. కాగా బుధవారం మరోసారి విచారణకు రావాలని రేవంత్‌ను అధికారులు ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top