కారుచీకటిలో నెత్తుటి ధారలు

Pregnent Woman And Family Died in Car Accident Guntur - Sakshi

ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్న కారు

ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత

ఒక కుటుంబంలో ముగ్గురు, మరో కుటుంబంలో ఇద్దరి మృతి

చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమైన కుమార్తెను అన్నీ తానై పెంచింది. ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసింది. తన చిట్టితల్లి.. తల్లి కాబోతోందని తెలిసి మురిసిపోయింది. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించు తల్లీ అంటూ సీమంతం వేడుకలో తన బిడ్డను పెద్దలు దీవించడంతో ఉప్పొంగిపోయింది. మంగళవారం మంచిది కాదని బిడ్డను తీసుకుని సోమవారం అర్ధరాత్రి కారులో ఇంటికి ప్రయాణమైంది. ఆ కారే మృత్యుశకటమై తల్లీకూతుళ్ల ప్రాణాలను బలిగొంది. కడుపులో శిశువు ప్రాణం తల్లితో పాటే అనంతవాయువుల్లో కలిసిపోయింది. యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ప్రమాదం ఆరుగురిని బలిగొంది. ఓ చిన్నారిని అనాథను చేసింది. మరొకరికి భార్యాబిడ్డలను దూరం చేసింది. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం 16వ నంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం అ«ర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో మూడు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరికీ గాయాలై చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. 

ప్రమాదం జరిగిందిలా...
వేజర్ల జయశ్రీ (19), తల్లి అనసూయ(40), బంధువు సుంకర రమాదేవి (37), రమాదేవి కుమార్తె రమ్య (18), కుమారుడు శ్రీకాంత్‌ (21), అతని మిత్రుడు ఫ్రాన్సిస్‌ సుమారు రాత్రి 11.45 గంటల సమయంలో తిమ్మాపురం నుంచి కారులో గుంటూరు సమీపంలోని గోరంట్లకు బయలు దేరారు. తిమ్మాపురం జాతీయ రహదారిపై ప్రసూన వంశీకృష్ణ మిల్లు సమీపంలో రాగానే శావల్యాపురంలో వ్యవసాయ పనులు ముగించుకుని మాగాణి దమ్ము చక్రాల లోడుతో ముందు వెళ్తున్న ట్రాలీ ట్రాక్టర్‌ను కారు వెనగ్గా ఢీకొట్టింది.

సుమారు 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న గర్భిణి జయశ్రీ, ఆమె తల్లి అనసూర్య అక్కడికక్కడే మృతి చెందారు. వారి పక్కనే ఉన్న సుంకర రమాదేవి, రమ్య, డ్రైవింగ్‌ చేస్తున్న శ్రీకాంత్, ఫ్రాన్సిస్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అర్ధరాత్రి ఆర్తనాదాలు...
హైవేపై ఒక్కసారిగా వాహనాలు ఢీ కొన్న శబ్దం రావడం, గాయపడిన వారు ఆర్తనాదాలు చేయడంతో సమీప మిల్లుల్లోని కార్మికులు, తిమ్మాపురం ఎస్సీకాలనీ లూథరన్‌ చర్చి వద్ద క్రిస్మస్‌ వేడుకల్లో ఉన్న స్థానికులు పరుగున వచ్చారు. క్షతగాత్రులను కాపాడేందుకు పోలీసులతోపాటు చిమ్మ చీకట్లలోనే సెల్‌ఫోన్‌ లైట్లు వేసుకుని శ్రమించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండ చూశారు. గాయాలైన వారందరనీ గుంటూరు, చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మూడు గ్రామాల్లో విషాదం..

జయశ్రీ అత్తిల్లు యడవల్లి, పుట్టిల్లు గోరంట్ల. ఫ్రాన్సిస్‌ స్వగ్రామమైన మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెం గ్రామాల్లో క్రిస్మస్‌ పండుగ రోజున తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. 

ప్రమాదానికి కారణాలు..
ప్రమాదం జరిగిన వెంటనే యడ్లపాడు ఎస్‌ఐ జే శ్రీనివాస్, సీఐ ఎస్‌ విజయచంద్ర చేరుకుని బాధితుల్ని ఆసుపత్రికి తరలించే విషయంలో అప్రమత్తం కాగా, ఇన్‌చార్జి డీఎస్సీ కాలేషావలి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.అతివేగం..విపరీతమైన మంచు, ట్రాలీ వెనుకరేడియం స్టిక్కరు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.  

పెళ్లయిన ఆరు నెలలకే..
చిలకలూరిపేట యడవల్లి గ్రామానికి చెందిన వేజర్ల వెంకట్రావు, రామాంజమ్మ దంపతుల కుమారుడైన నాగరాజుకు, గుంటూరు రూరల్‌ మండలానికి చెందిన తంగెళ్ల శ్రీనివాసరావు, అనసూయ కుమార్తె జయశ్రీ (19)కి ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. జయశ్రీ మూడు నెలలుగా పుట్టింటిలోనే ఉంటుంది. సీమంతం నిమిత్తం సోమవారం అత్తగారింటి రావడంతో భార్యాభర్తలు ఎన్నొ ఊసులు చెప్పుకుంటూ ఆనందంగా కనిపించారు. నిండు నూరేళ్లు జీవించాలని, పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటూ తల్లిదండ్రులు, అత్తమామాలు, బంధుమిత్రులు దంపతుల్ని అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబంలో కొన్ని గంటల్లోనే విషాదం అలుముకుంది.

తల్లీబిడ్డలు కానరాని లోకాలకు..
నా ఆటోలో తీసుకెళ్లినా బతికేవారయ్యా అంటూ సుంకర రమాదేవి భర్త ఆటోడ్రైవర్‌ పూర్ణచంద్రరరావు కన్నీరు మున్నీరయ్యారు. రాత్రి గోరంట్ల నుంచి ఆటోలో వెళ్లిన వారు సీమంతం జరిగిన అమ్మాయిని ఆటోలో తీసుకెళ్లవద్దని అక్కడి బంధువులు చెప్పారన్నారు. అర్ధరాత్రి పోలీసుల నుంచి ఫోన్‌ రావడంతో గుండెలు జారిపోయాయయ్యా అంటూ రోదించారు. అబ్బాయి శ్రీకాంత్‌ కారు డ్రైవర్, అమ్మాయి రమ్య గోరంట్ల సెయింట్‌ ఆన్స్‌లో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. భార్యాబిడ్డలను కోల్పోయిన ఆయన గుండెలు బాదుకుంటున్నాడు.

పండుగ నాడు మృత్యువు ఒడిలోకి..
గుంటూరు ఈస్ట్‌: సంతోషంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకోవాల్సిన ఇంటిలో తీరని విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో ఇంట్లోని చిన్న కుమారుడు దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మేడికొండూరు మండలం గుల్లపాలెంకు  చెందిన కొటికల ఫ్రాన్సిస్‌ తండ్రి గతంలోనే మృతి చెందారు. తల్లి సమాధానం కూలి పనుల కోసం ఇటీవల హైదరాబాద్‌ వెళ్ళింది. ఫ్రాన్సిస్‌ స్నేహితుడితో కారులో వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. అన్న మల్లేశ్వరరావు, తల్లి సమాధానం గుంటూరు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.

ట్రాక్టర్‌పై ఉన్న వారికీ గాయాలు
ట్రాక్టర్‌ వెనక ట్రాలీని కారు ఢీకొనడంతో ట్రాలీ పల్టీలు కొడుతూ దూరంగా వెళ్లి పడింది. కారు సుమారు 50 మీటర్లు వరకు బలంగా తోసుకుంటూ వెళ్లడంతో కారు ముందు భాగం, టాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ట్రాక్టర్, ట్రాలీ కూడా దెబ్బతిన్నాయి. ట్రాక్టర్‌పై ఉన్న కొల్లిపర మండలం క్రాప గామానికి చెందిన బోసి హనుమంతరావు, కలపల రమేష్‌లకు గాయాలయ్యాయి. వీరిని చిలకలూరిపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top