విశాఖలో డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

Police Arrested Drug Gang In Visakha - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ డ్రగ్స్ కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకొని నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ముఠా సభ్యులు నలుగురిని టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. వారి నుంచి మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు గత ప్రభుత్వ హయాంలో రుషికొండ బీచ్‌లో నిర్వహించిన రేవ్‌ పారీ్టలో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ నగర పర్యటనలో ఉన్న సమయంలో నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మాదక ద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నట్లు టాస్‌్కఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ.త్రినాథరావు తన సిబ్బందితో కలిసి పోర్టు క్వార్టర్స్‌లో దాడులు నిర్వహించారు.

అక్కడ సీతంపేటకు చెందిన మానుకొండ సత్యనారాయణ, నర్సింహనగర్‌కు చెందిన మజ్జి అజయ్‌కుమార్, కంచరపాలేనికి చెందిన కేతి మనోజ్‌స్వరూప్, బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు చెందిన కంది రవికుమార్‌లు డ్రగ్స్‌ విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 61 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 2.5 ఎంజీ ఎండీఎంఏ పౌడర్, 6 గంజాయి ప్యాకెట్లతో పాటు రూ.9,500 నగదు  పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. వీరిలో మానుకొండ సత్యనారాయణ గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన మంత్రి సన్నిహితుడి కుమారుడు రుషికొండ బీచ్‌లో రహస్యంగా నిర్వహించిన రేవ్‌పార్టీ డ్రగ్స్‌ కేసులో నిందితుడు కావడం గమనార్హం. ఒకవైపు రాష్ట్ర డీజీపీ నగరంలో పర్యటిస్తున్న సమయంలో డ్రగ్స్‌ వ్యవహారం వెలుగుచూడడంతో జిల్లాలో కలకలం రేగింది. నిందితులను టాస్‌్కఫోర్స్‌ పోలీసులు నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కొత్త పంథాలో డ్రగ్స్‌ దందా..
కరోనా కారణంగా కళాశాలల మూసివేతతో కొత్త పంథాలో డ్రగ్స్‌ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా యువతకు గాలం వేసి ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా, బెంగుళూరుల నుంచి డ్రగ్స్ ను విశాఖ తీసుకువస్తున్నట్లు గుర్తించారు. కరోనాతో గోవా బిజినెస్ మూతబడటంతో బెంగుళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ కేసును మరింత లోతుగా విచారించాలని విశాఖ సీపీని  డీజీపీ ఆదేశించారు. డ్రగ్స్ కేసును మరింత లోతుగా విచారించడంలో భాగంగా నిందితులను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top