ఇరవై నెలలకు చిక్కారు..

Persons Doing Robbery Only Womens In Godavarikhani - Sakshi

సాక్షి, గోదావరిఖని : జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను రామగుండం కమిషనరేట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. రామగుండం అడిషనల్‌ డీసీపీ అశోక్‌కుమార్‌ కమిషనరేట్‌లో శనివారం వివరాలు వెల్లడించారు. రామగుండం మండలం రాయదండికి చెందిన గుమ్మాల వసంతకుమార్, ఓ మైనర్, పాత రామగుండం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన పల్లికొండ సురేష్‌ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఏడాది క్రితం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మోటార్ల దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. 

మహిళను కత్తితో బెదిరించి.. 
అంతకు పదినెలల ముందుగానే 2017నవంబర్‌లో పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దంపేట గ్రామశివారులో పత్తి చేనులో పత్తి తీస్తున్న విమలను బెదిరించి రూ.1.05 లక్షల విలువైన మూడు తులాల బంగారు పుస్తెలుతాడు చోరీచేశారు. అప్పటినుంచి అనుమానం రాకుండా సెంట్రింగ్‌ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని పగటిపూట ఆటోలో తిరుగుతూ.. పంటపొలాల్లో ఒంటరిగా ఉన్నమహిళలను టార్గెట్‌ చేసుకొని వారిని బెదిరించి దొంగతనాలు చేశారు.

ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లోని ఆలయం, టెలిఫోన్‌ కార్యాలయాల్లో సైతం చోరీలకు పాల్పడ్డారు. దొంగతనం చేసిన సొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవారు. శనివారం సీఐ బుద్దస్వామి, అంతర్గాం ఎస్సై రామకృష్ణ, సీసీఎస్‌ సీఐ వెంకటేశ్వర్లు బి–పవర్‌హౌస్‌ వద్ద ఆకస్మికంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు పట్టుపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు.మూడు తులాల బంగారు పుస్తెలుతాడు రికవరీ చేశారు. 

నిందితులపై పీడీయాక్టు..
నిందితులపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు అడిషనల్‌ డీసీపీ వెల్లడించారు. మైనర్‌ను జూవైనల్‌ హోంకు తరలిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన సీసీఎస్‌ సీఐలు ఎ.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, ఎస్సైలు మంగిలాల్, నాగరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి, కానిస్టేబుళ్లు దేవేందర్, సుధాకర్, శ్రీనివాస్, అలెక్స్, రవి, రమేష్‌లను అడ్మిన్‌ డీసీపీ అభినందించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ రవికుమార్, సీఐలు బుద్దె స్వామి,  వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రావు, ఎస్సై రామక్రిష్ణ పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top