రోడ్డు ప్రమాదంలో పేపర్‌ బాయ్‌ దుర్మరణం

Paper Boy Died in Bike Accident in Hyderabad - Sakshi

నల్లకుంట: బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ పేపర్‌ బాయ్‌(మైనర్‌) మృతి చెందిన సంఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సవార్‌ వెంకట్‌ రావు, భార్య సంగీత, కుమారుడు అభినవ్‌(14)తో కలిసి బాగ్‌అంబర్‌పేట మల్లిఖార్జుననగర్‌లో ఉంటున్నాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభినవ్‌ గత కొన్ని నెలలుగా అదే ప్రాంతానికి చెందిన సతీష్‌ అనే న్యూస్‌ పేపర్‌ ఏజెంట్‌ వద్ద పేపర్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున పేపర్‌ వేసేందుకు వెళ్లిన అతడిని సతీష్‌ ఓయూ ఎన్‌సీసీ చౌరస్తాలో  పేపర్లు ఇచ్చిరావాలని చెప్పాడు. దీంతో అతను తన సైకిల్‌ అక్కడే పెట్టి ఏజెంట్‌కు చెందిన బైక్‌ తీసుకుని పెట్రోల్‌ ట్యాంక్‌పై బండిల్‌ పెట్టుకుని బయలు దేరాడు. శివం రోడ్డులోని సత్య సూపర్‌ మార్కెట్‌ సమీపంలో పేపర్‌ బండిల్‌ హ్యాండిల్‌కు తగలడంతో బైక్‌ అదుపుతప్పి  ఫుట్‌ పాత్‌పైకి దూసుకెళ్లింది. అభినవ్‌ ఫుట్‌పాత్‌ పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మరో పేపర్‌ బాయ్‌ శ్రీనివాస్‌ అభినవ్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. నల్లకుంట పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి వెంకట్‌ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్‌ను పనిలో పెట్టుకోవడమే కాకుండా అతడికి వాహనం ఇచ్చినందుకు పేపర్‌ ఏజెంట్‌ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

మహారాష్ట్ర నుంచి నగరానికి వలస వచ్చిన వెంకట్‌ రావు, సంగీత దంపతులకు అభినవ్‌ ఒక్కడే కుమారుడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంగీత సమీపంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆయాగా పనిచేస్తూ కుమారుడిని డీడీ కాలనీలోని కార్పొరేట్‌ పాఠశాలలో చదివిస్తోంది. తల్లి కష్టాన్ని చూసిన అభినవ్‌ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకుగాను 8 నెలలుగా పేపర్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తనకు పాయసం తినాలని ఉందని చెప్పడంతో సంగీత కుమారునికి పాయసం చేసి పెట్టింది. మంగళవారం ఉదయం తల్లి నిద్రలేపగా ఈ రోజు పేపర్‌ వేసేందుకు వెళ్లనని చెప్పిన అభినవ్‌ కొద్ది సేపటికే లేచి పేపర్‌ వేసేందుకు వెళ్లిపోయాడు. రెండు గంటలు గడువకముందే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలియడంతో ఆమె బోరున విలపించింది. 

ఎమ్మెల్యే పరామర్శ  
స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ బాలుని మృతదేహం వద్ద నివాళులర్పించి, మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.. వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే అతని అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేశా రు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహా యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్‌ డి.పద్మావతి రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top