నాడు గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌.. నేడు గ్యాంగ్‌స్టర్‌

National Gold Medal Winner Wrestler Pulled In Murder Case - Sakshi

రోహ్‌తక్‌(హరియాణా) : ఒకప్పుడు అతను జాతీయస్థాయి కుస్తీ పోటిల్లో బంగారు పతకం సాధించాడు. మరి నేడు పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌. ఒక హత్యానేరంలో ప్రధాన నిందితుడు. అతనిని పట్టించిన వారికి 25 వేల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు పోలీసులు. చివరకు మంగళవారం(నిన్న) పోలీసుల చేతికి చిక్కాడు. అతనే రోహ్‌తక్‌లోని మొఖ్రా గ్రామానికి చెందిన రాకేష్‌ మొఖ్రియా. గత ఏడాది జూన్‌లో, అస్సాన్‌ గ్రామానికి చెందిన బల్బీర్‌ హత్యకేసులో రాకేష్‌ ప్రధాన నిందితుడు.

రాకేష్‌ ఎందుకు అరెస్ట్‌ చేయాల్సివచ్చిందో రోహతక్‌ ఎస్పీ జషన్‌దీప్‌ సింగ్‌ రంధవా చెబుతూ.. ‘గత ఏడాది జూన్‌లో బల్బీర్‌ సింగ్‌, రాకేష్‌కు మధ్య మద్యం కాంట్రాక్ట్‌ విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో రాకేష్‌ తన అనుచరులతో కలిసి బల్బీర్‌ను చంపేసారు. ఈ హత్యకేసులో పోలీసులు రాకేష్‌ అనుచరులను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ రాకేష్‌ మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అలానే అతని ఆచూకీ తెలిపిన వారికి 25 వేల రూపాయల నగదు బహుమతిని కూడా ఇస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం బల్బీర్‌ హత్యతో సంబంధం ఉన్న రాకేష అనుచరున్ని ఒకన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో సోమవారం రాత్రి ఝాజ్జ బైపాస్‌ రోడ్‌లో ఉన్న రాకేష్‌ను యాంటి వెహికల్‌ థేఫ్ట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారని’ తెలిపారు.

రాకేష్‌ను అరెస్ట్‌ చేసిన సమయంలో అతని వద్ద నుంచి ఒక 30బోర్‌ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బల్బీర్‌ను హత్య చేసిన తరువాత రాకేష్‌ రాజస్థాన్‌ వెళ్లి తలదాచుకున్నట్లు విచారణలో తెలిపాడన్నారు. అంతేకాక వీరి గ్యాంగ్‌ లీడర్‌ రోహ్‌తష్‌ కుమార్‌ విడుదల కోసం ఎదురుచుస్తున్నాడని, అతను జైలు నుంచి విడుదల కాగానే తిరిగి నేరాలు ప్రారంభిద్దామనుకుంటున్నట్లు తెలిపాడని వెల్లడించారు.

కుస్తీ పోటీల్లో బంగారు పతకం...
రాకేష్‌ 2003లో నిర్వహించిన జాతీయ కుస్తీ పోటిల్లో హరియాణా తరుపున పాల్గొని బంగారు పతకం సాధించాడు. అలానే అదే ఏడాది ‘తల్కతోర స్టేడియం’లో జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. కానీ 2005లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆవేశంలో ఝజ్జర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసినందుకుగాను 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన నేర ప్రవృత్తిని మానుకోలేక గతేడాది మరో వ్యక్తిని హత్య చేసి మరోసారి జైలుకెళ్లబోతున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top