రాజకీయ ఆధిపత్యం కోసమే ఈ హత్య | This murder only for political supremacy | Sakshi
Sakshi News home page

రాజకీయ ఆధిపత్యం కోసమే ఈ హత్య

Mar 17 2019 4:35 AM | Updated on Mar 17 2019 4:35 AM

This murder only for political supremacy - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి. చిత్రంలో కడప మేయర్‌ సురేష్‌బాబు

కడప కార్పొరేషన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరున్నా బయటికి రావాల్సిందేనని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందేనని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. శనివారం కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా పక్కదారి పట్టించాలో అన్ని రకాలుగా పట్టిస్తోందన్నారు. బాధ్యతగల ప్రభుత్వమైతే.. హత్య చేసిందెవరు, చేయించిందెవరు, కుట్ర కోణం ఏమిటీ అని ఆరా తీయాలన్నారు. అలా చేయకుండా శవ రాజకీయాలే ధ్యేయంగా పక్కదారి పట్టించడం దారుణమన్నారు. ఈ కేసులో సిట్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి న్యాయం జరగదన్నారు. అందుకే స్వతంత్ర సంస్థతోగానీ, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితోగానీ విచారణ జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. శుక్రవారం నాటి పరిణామాలను ఆయన వివరించారు.

గుండెపోటుతో చనిపోయారని ఎక్కడా చెప్పలేదు..
‘‘శుక్రవారం ఉదయం 6.30 గంటలకు నేను ఇంటినుంచి బయటికి వచ్చాను. జమ్మలమడుగులో పార్టీ చేరికల దృష్ట్యా అక్కడికి వెళ్లాలని ప్రయాణమయ్యా. అంతలోనే పెద్దనాన్న వైఎస్‌ వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌ చేసి బావ చనిపోయాడంట, మీరు ఇంటికి వెళ్లండి అని ఏడుస్తూ ఫోన్‌ చేశారు. ఆ వెంటనే వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లాను. అప్పటికే ప్రజలు గుమికూడి ఉన్నారు. మేము మృతదేహాన్ని చూసి 6.43 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేశాం. 15 నిమిషాలు వేచి చూసి 7.00, 7.07, 7.09 గంటలకు వరుసగా ఫోన్లు చేశాం. 7.13 గంటలకు సీఐ వచ్చారు. మృతదేహాన్ని వారికి అప్పగించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పాం.

వివేకానందరెడ్డి కుమార్తె సునీతమ్మ స్వతహాగా డాక్టర్‌ అయినందున ఆమె వచ్చేవరకూ పోస్టుమార్టం చేయవద్దని చెప్పడం జరిగింది. మధ్యాహ్నానికి వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడు, మరికొందరు డాక్టర్లు వచ్చి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా ఇది హత్యేనని స్పష్టం చేశారు. 10.30 గంటలకు మేం మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా పెద్దనాన్న వివేకాది సహజ మరణం కాదని, అనుమానాస్పద మృతి అన్నామే తప్ప గుండెపోటుతో చనిపోయారని ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వం బాధితులపై విమర్శలు చేస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు.

సిట్‌ వల్ల సత్వర న్యాయం శూన్యమే
ఈ ఘటనలో సిట్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి న్యాయం జరగదని అవినాష్‌రెడ్డి అన్నారు. టీడీపీ ఐదేళ్ల పదవీకాలంలో ఎన్నో సందర్భాల్లో సిట్‌ వేశారని, ఏ కేసులోనూ బాధితులకు న్యాయం జరగలేదని, వాస్తవాలు బయటికి రాలేదని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న సిట్‌ వల్ల న్యాయం జరిగే అవకాశమే లేదన్నారు. అందుకే తాము స్వతంత్ర దర్యాప్తు సంస్థతోగానీ, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితోగానీ విచారణ జరపాలని కోరుతున్నామని చెప్పారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి అజాత శత్రువని, ఆయన చంపబడి ఉంటాడని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. వెంటనే హత్య అని చెబితే ప్రజలు రెచ్చిపోయి అల్లర్లకు పాల్పడితే తిరిగి మాపైనే నెపం వేయాలన్నది సీఎం అభిమతంగా ఉందని చెప్పారు. వివేకాను ఎవరు హత్య చేశారో, వెనకుండి ఎవరు చేయించారో చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఉదయం తాము సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ ఎలాంటి పేపర్‌ లేదని, సాయంత్రం డీఐజీ వైఎస్‌ జగన్‌ గారికి చూపారని అవినాష్‌రెడ్డి చెప్పారు. డ్రైవర్‌పై రాసిన పేపర్‌ ఎవరైనా సృష్టించారా? లేదా? అనేది పోలీసులే తేల్చాలన్నారు. రాజకీయ ఆధిపత్యం కోసమే ఈ హత్య జరిగిందని అనుమానం వెలిబుచ్చారు. వైఎస్‌ కుటుంబ సభ్యుల్నే వారి ఇంటికెళ్లి చంపాం.. ఇక మీరెంతరా అని పార్టీ కార్యకర్తల్ని బెదిరించడానికే ఇలా చేశారన్నారు. 

సీఎంను గాక ఇంకెవరిని అడగాలి: మేయర్‌ సురేష్‌బాబు
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహారం ఉందని సురేష్‌బాబు తప్పుపట్టారు. రౌడీషీటర్లకు గన్‌మెన్లు ఇచ్చిన ప్రభుత్వం రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడికి గన్‌మెన్‌ తొలగించడం వల్లే ఈ హత్య జరిగిందన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా, దీనిపై ముఖ్యమంత్రిని గాక ఇంకెవరిని అడగాలన్నారు. వైఎస్‌ కుటుంబానికే ఈ హత్యతో సంబంధమున్నట్టు మాట్లాడటం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement