పగబట్టి ప్రాణం తీశారు

Murder Case Peddapalli - Sakshi

 హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మిస్టరీ వీడింది.. పాత కక్షలే ప్రాణం తీశాయని వెల్లడయింది..తండ్రి సత్తిరెడ్డి హత్యకు ప్రతీకారంగా కొడుకు మహిపాల్‌రెడ్డి పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామానికి చెందిన సల్లారపు సత్తిరెడ్డి, సల్లారపు రాంరెడ్డి కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో జూన్‌ 16న ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా..సత్తిరెడ్డిని రాంరెడ్డి కర్రతో దాడిచేసి హత్యచేశాడు. పోలీసులు నిందితుడు రాంరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపగా..బెయిల్‌ విడుదలయ్యాడు. ఈక్రమంలో రాంరెడ్డిని మట్టుబెట్టేందుకు సత్తిరెడ్డి కొడుకు మహిపాల్‌రెడ్డి, అతడి బావ ముత్తంగి తిరుపతిరెడ్డి, అల్లుడు మధుసూదన్‌రెడ్డితో పక్కా ప్రణాళిక రచించి రాంరెడ్డి కదలికలపై నిఘా పెట్టారు.

విషయం పసిగట్టని రాంరెడ్డి ఈనెల 23న బస్వాపూర్‌ గ్రామంలో తన బంధువుల ఇంట్లో జరిగిన గృహప్రవేశానికి హాజరై..హరీశ్‌ అనే యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా..ఇదే అదునుగా భావించిన మహిపాల్‌రెడ్డి బస్వాపూర్, నేరెళ్ల గ్రామాల మధ్య నిర్మాణుష్య ప్రదేశంలో తన హ్యూందయ్‌ కారుతో రాంరెడ్డి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో రాంరెడ్డి, హరీశ్‌ రోడ్డు పక్కన గుంతలో పడిపోయారు. కారులోంచి దిగిన మధుసూదన్‌రెడ్డి కర్రతో రాంరెడ్డి తలపై కొట్టగా..మహిపాల్‌ గొడ్డలితో నరికాడు. దీంతో రాంరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. తనను కూడా చంపుతారేమోననే భయంతో హరీశ్‌ పరుగులు పెట్టి రోడ్డుపక్కన కల్వర్టులో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు.

రాంరెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్న నిందితులు మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి హైదరాబాద్‌ పారిపోగా..తిరుపతిరెడ్డి వేములవాడకు వెళ్లిపోయాడు. మూడు స్పెషల్‌ టీమ్‌లుగా గాలిస్తున్న పోలీసులకు ముగ్గురు నిందితులు కారులో సిరిసిల్ల వైపు వస్తుండగా చాకచక్యంగా జిల్లెల్ల చెక్‌ పోస్టు వద్ద రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌ అరెస్టు చేశారు. పోలీసులు విచారించగా లొంగిపోయేందుకే సిరిసిల్లకు వస్తున్నట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి హ్యూందయ్‌ కారు, ద్విచక్రవాహనం, హత్యకు వాడిన గొడ్డలి, కర్రలు, నాలుగు సెల్‌ ఫోన్లు, రక్తపు మరకలు కలిగిన దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించి పూర్తి ఆధారాలతో నిందితులను అరెస్టు చేసిన సీసి అనిల్‌కుమార్, తంగళ్లపల్లి ఎస్సై వెంకటకృష్ణ, ముస్తాబాద్‌ ఎస్సై రాజశేఖర్, ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రవీణ్‌ను డీఎస్పీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top