షాకింగ్‌ : 34 ఏళ్లపాటు ఇసుకలోనే! | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : 34 ఏళ్లపాటు ఇసుకలోనే!

Published Sat, Jun 23 2018 3:48 PM

 Missing Lorry Found In Karimnagar After 30 Years - Sakshi

సాక్షి, కరీంనగర్‌ రూరల్‌ : కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల వాగులో దాదాపు మూడు దశాబ్దాల క్రితం భారీ వర్షాలతో గల్లంతైన లారీ కోసం శుక్రవారం సాయంత్రం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో లారీ విడిభాగాలతో పాటు మూడు మృతదేహాలకు సంబంధించిన ఎముకలు(అవశేషాలు), ఒక పుర్రె లభించింది. ఈనెల 12న సాక్షి దినపత్రికలో ‘34 సంవత్సరాల క్రితం గల్లంతైన లారీ లభ్యం’శీర్షికన వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. 1984లో భారీ వర్షాలకు ఇరుకుల్ల వాగు వంతెనపై నుంచి వరద వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ క్రమంలో వంతెన దాటేందుకు యత్నించిన లారీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. లారీ బయటపడిందని వార్త కథనంతో కేశవపట్నంలో ఉంటున్న మృతుల కుటుంబ సభ్యులు గురువారం తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ను కలిసి వాగులో నుంచి లారీని తవ్వి తీసేందుకు అనుమతి కోరారు. శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు జేసీబీతో తవ్వకాలు చేపట్టగా లారీ విడిభాగాలు లభించాయి. మూడు మృతదేహాలకు సంబంధించిన పుర్రె, ఎముకల అవశేషాలు బయటపడ్డాయి.

అవశేషాలకున్న బట్టల ఆధారంగా కేశవపట్నానికి చెందిన దౌలత్‌ఖాన్, ముక్దుం ఖాన్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే వీరిద్దరు సొంత అన్నదమ్ములు కాగా ముక్దుంఖాన్‌ అవశేషానికి ఉన్న బట్టల ఆధారంగా మరో మృతుడు కటిక శంకర్‌గా కుటుంబ సభ్యులు పేర్కొనడంతో మృతుల గుర్తింపుల్లో స్పష్టత లేదు. ప్రమాదంలో గల్లంతైన మరో మృతుడు వెంకటస్వామి మృతదేహం ఆనవాళ్లు లభించలేదు. భారీ వర్షంతో పాటు రాత్రి కావడంతో తవ్వకాలను నిలిపివేశారు. శనివారం ఉదయం మృతుల బంధువుల సమక్షంలో మృతదేహాల అవశేషాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement