వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య | Married Woman Commits Suicide InChittoor | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Oct 29 2018 11:43 AM | Updated on Oct 29 2018 11:43 AM

Married Woman Commits Suicide InChittoor - Sakshi

భర్త ఈశ్వర్‌తో లావణ్య (ఫైల్‌) లావణ్య మృతదేహం

చిత్తూరు, తిరుపతి క్రైం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం తిరుపతి నగరం కొర్లగుంటలో జరిగింది. ఈస్ట్‌ సీఐ చంద్రబాబునాయుడు కథనం మేరకు.. కొర్లగుంటలో నివాసముంటున్న ప్రకాష్, కమల దంపతుల కుమార్తె లావణ్య(20)ను చిత్తూరు సమీపంలోని బొడేవారిపల్లెకు చెందిన నిర్మల, ఆంజనేయులు దంపతుల కుమారుడు ఈశ్వర్‌(25) మైనర్లుగా ఉన్నప్పుడే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు దూరంగా కొర్లగుంటలోని ప్రశాంత్‌ స్కూల్‌ సమీపంలో కాపురం పెట్టారు. వీరికి భవ్య(3) కుమార్తె ఉంది. ఈశ్వర్‌ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతను కొంతమంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు భార్య గుర్తించింది.

దీనిపై భర్తను నిలదీసేది. దీంతో ఈశ్వర్‌ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. శనివారం రాత్రి కూడా భార్య, భర్త గొడవపడ్డారు. అనంతరం ఏమి జరిగిందేమోగానీ ఉదయం లేచి చూసే సరికి లావణ్య ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ, ఎస్‌ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకురాలు శ్రీదేవి, ఐద్వా లక్ష్మీ సంఘటన స్థలానికి చేరుకుని లావణ్యను భర్త ఈశ్వర్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వేధింపులకే ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement