వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide in Anantapur Extra Dowry Harassment - Sakshi

 కట్నం వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు

కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్‌

అనంతపురం, గోరంట్ల: కమ్మలవాండ్లపల్లిలో బి.వాణిశ్రీ (22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వాణిశ్రీ, నాగరాజు దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మద్యానికి బానిసైన నాగరాజు రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చాడు. అదనపు కట్నం తీసుకురానందున మీ పుట్టింటి వారు ఇక్కడికి వచ్చినా, వారితో నీవు మాట్లాడినా తాను తెగదెంపులు చేసుకుని మరో పెళ్లి చేసుకుంటానంటూ నాగరాజు భార్యను హెచ్చరించాడు. అంతటితో ఆగక అలిగి కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి రచ్చబండ వైపు వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన వాణిశ్రీ ఇంట్లోనే ఇనుపరాడ్‌కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భర్త, స్థానికులు గమనించి ఉరికి వేలాడుతున్న వాణిశ్రీని కిందకు దించి గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే ఆమె ప్రాణం విడిచింది. 

మెట్టినింటి వారిపై ఆగ్రహం
తమ కుమార్తె వాణిశ్రీ మృతికి మెట్టినింటి వారి కట్నం వేధింపులే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతురాలి తండ్రి వెంకటరామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదులో ఆలస్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బంధువులతో కలిసి మృతదేహంతో మంగళవారం ప్రభుత్వాస్పత్రి నుంచి బస్టాండ్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని తెలపడంతో వారు శాంతించారు. 

ఐదుగురిపై కేసు నమోదు
ఫిర్యాదును పలుమార్లు మార్చి ఇవ్వడంతో కేసు నమోదు చేయడానికి ఆలస్యమైందని సీఐ జయనాయక్‌ స్పష్టం చేశారు. వాణిశ్రీ మృతికి ఆమె భర్త నాగరాజుతో పాటు అతని సోదరులు నాగేంద్ర, రవి, శ్రీనివాసులు, ఆడపడుచు రత్నమ్మ కారణమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఐదుగురిపైనా కేసు నమోదు చేశామన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top