స్నేహాన్ని విడదీసిన మృత్యువు | Man Died In Road Accident In Visakhapatnam | Sakshi
Sakshi News home page

స్నేహాన్ని విడదీసిన మృత్యువు

Sep 14 2019 9:19 AM | Updated on Sep 14 2019 9:19 AM

Man Died In Road Accident In Visakhapatnam - Sakshi

ప్రమాదంలో మృతి చెందిన కనక నాయుడు

సాక్షి, అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్టణం): వారిద్దరూ స్నేహితులు. రోజూ కలిసే విధులకు వెళ్లొస్తుంటారు. వీరి స్నేహాన్ని చూసి విధికి కన్ను కుట్టునట్టుంది. విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు రూపంలో విడదీసింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాపుతుంగ్లాం చుక్కవానిపాలెంకు చెందిన నీరుజోగి కనకనాయుడు (28), స్నేహితుడు మోహన్‌ ఇద్దరూ ఎల్‌అండ్‌టీలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరూ విధులు ముగించుకుని స్కూటీపై పై ఇంటికి బయటు దేరారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డు నుంచి షీలానగర్‌ వైపు వస్తుండగా సరిగ్గా టోల్‌గేటు సమీపిస్తుండగా వీరి స్కూటీ రోడ్డు పక్కగా ఉన్న గోతిలోకి వెళ్లింది. దీంతో కనకనాయుడు, మోహన్‌ ఇరువురూ తూలి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ కనకనాయుడుపై నుంచి దూసుకుపోయింది. ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ మొబైల్, బ్లూ కోర్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌ తరలించారు. మృతుని స్వస్థలం వేపాడ మండలం సింగరయ్య గ్రామం, ఈయనకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్య పరమేశ్వరి ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. క్షతగాత్రుని వివరాలు తెలియాల్సి ఉంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలిసి తుంగ్లాం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement