స్పోర్ట్స్ బైక్‌తో ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లి.. | Speeding Sports bike drags Mumbai woman to death rider also killed | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ బైక్ విధ్వంసం.. ప్రాణాలు కోల్పోయిన మ‌హిళ‌

Jul 29 2026 7:53 PM | Updated on Jul 29 2026 7:59 PM

Speeding Sports bike drags Mumbai woman to death rider also killed

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ముంబై: గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ మహిళను రోడ్డు ప్రమాదం బ‌లితీసుకుంది. స్పోర్ట్స్ బైక్‌తో ఆమెను ఢీకొట్టిన యువకుడు కూడా ఈ దుర్ఘ‌ట‌నలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి ముంబైలోని మహిమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మహిమ్ కాజ్‌వేకు చెందిన మంగళ అశోక్ టాండెల్ (46) సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గురు పౌర్ణమి సందర్భంగా సోలాపూర్ జిల్లాలోని అక్కల్‌కోట్‌లో ఉన్న శ్రీ స్వామి సమర్థ మఠం దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణానికి సంబంధించిన సామాన్లు సర్దుకుని, బంధువులు సిద్ధమయ్యారా అని తెలుసుకోవడానికి ఆమె లేడీ జంషెడ్‌జీ రోడ్డును దాటుతుండగా ప్రమాదం జరిగింది.

బాంద్రా వైపు అత్యంత వేగంగా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో మంగళను బైక్ దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. అనంతరం ఆమెను వెంటనే రాహేజా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి భర్త ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి కాగా, వారికి సలోనీ (22), సానియా (20) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఇదే ప్రమాదంలో బైక్ నడుపుతున్న ధ్రువ్ గురవ్ (21) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మహిమ్ ఫిషర్‌మెన్ కాలనీకి చెందిన అతడిని భాభా ఆస్పత్రికి తరలించగా, చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ధ్రువ్ తన తల్లిని బాంద్రా నుంచి ఇంటికి తీసుకురావడానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతని తల్లిదండ్రులు గతంలో వివిధ ఆర్కెస్ట్రా బృందాలతో గాయకులుగా పనిచేసేవారని, ప్రస్తుతం వివిధ కార్యక్రమాల్లో పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు.

ధ్రువ్, అతని అన్న ఇద్దరికీ స్పోర్ట్స్ బైక్‌లపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని, వారి కుటుంబం వద్ద ఒకటి కంటే ఎక్కువ స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ధ్రువ్ గతంలో కూడా ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 106 (నిర్లక్ష్యంతో మరణానికి కారణం కావడం), సెక్షన్ 281 (బహిరంగ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం)తో పాటు మోటారు వాహనాల చట్టంలోని ఇతర నిబంధనల కింద మృతుడైన ధ్రువ్ గురవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement