మాఫియాలతో బహుపరాక్‌!

Mafia Gangs Targets Elections States In India - Sakshi

హుండీ, హవాలా దందాలపై డేగ కన్నేయండి

ఫేక్‌ కరెన్సీ ముఠాలపై నిఘా ముమ్మరం చేయండి

ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు

ఎన్నికలు సమీపిసున్న వేళ అక్రమార్కులకు కళ్లెం వేయాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. ధనం, మద్యం ప్రవాహంతో పాటు మాఫియా సైతం విజృంభించే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాయి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని,  హుండీ, హవాలా దందాలపై డేగకన్నేయాలని పేర్కొన్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గతానికి భిన్నంగా వ్యయం భారీగా పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికీ మించి ఆందోళనకర కోణాలు కేంద్ర నిఘా వర్గాలు వెలుగులోకి తెచ్చాయి. ధనం, మద్య ప్రవాహంతో పాటు మాఫియా సైతం విజృంభించే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశాయి. రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా, ఓ దేశంలోని వివిధ ప్రాంతాలమార్పిడిని హుండీ అంటారు. సాధారణంగా ఈ రెండు రకాలైన మార్గాలను పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారలు ఉపయోగించుకుంటారు. ఎన్నికల సీజన్‌లో పార్టీలు, అభ్యర్థులు తమ అనధికారిక ఖర్చుల కోసం వీటినే ఆశ్రయిస్తాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ రెండింటితో పాటు అధీకృత మార్పిడిదారుల లావాదేవీలనూ నిశితంగా పరిశీలించాల్సిందిగా నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.

భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలూ నకిలీ నోట్లను ముద్రిస్తున్నాయి. వీటిని ఎక్కడికక్కడ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ముఠాల సాయంతో బంగ్లాదేశ్‌ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు చేర్చి అక్కడ నుంచి వివిధ నగరాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘ఎన్నికల ఖర్చుల’కు అవసరమైన డబ్బు కోసం అనేక మార్గాలను అన్వేషించే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ కరెన్సీని చెలామణి చేయడానికి ముఠాలు ప్రయత్నిస్తాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. డీమానిటైజేషన్‌ తర్వాత ఈ సమస్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయినా... ఎన్నికల సీజన్‌లో పెరగవచ్చని అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఈ నేరం చేస్తున్న గ్యాంగ్‌లకు తోడు డిమాండ్‌ ఆధారంగా కొత్తవి కూడా పుట్టుకు వచ్చే ప్రమాదం ఉందన్నాయి. దుబాయ్‌ కేంద్రంగా జరిగే హవాలా వ్యవహారంలో ప్రతి ముఠాకూ రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు. నగదు పంపాల్సిన వారు దుబాయ్‌లో ఉన్న ఏజెంట్‌ను డబ్బును అందిస్తే... అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్‌లోని ఏజెంట్‌ ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీ చేస్తాడు. తాజాగా ఈ పంథా మారింది.

దుబాయ్‌లో వ్యక్తుల నుంచి ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న దుబాయ్‌మాడ్యుల్‌తో పాటు పాకిస్థాన్‌లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు. ఇక్కడ డెలివరీ చేయడానికి మాత్రం ఉత్తరాదిలో ఏర్పాటు చేసుకున్న ముఠాలతో సైబర్‌ నేరాలు చేయించి ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీకి వినియోగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు విశృఖలంగా పంజా విసురుతాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యాన్ని భారీగా వినియోగిస్తుంటారు. ఖర్చుల లెక్కల్లో చూపించకుండా ఉండేందుకు అనేక మార్గాల్లో మద్యాన్ని కొనుగోలు చేయడానికి వెనుకాడరు. దీన్ని అదునుగా చేసుకుని నకిలీ మద్యం మాఫియా కూడా రెచ్చిపోతుందనేది నిఘా వర్గాల అంచనా. మిగిలిన మాఫియాల ప్రభావం నేరుగా ప్రజలపై లేకున్నా... నకిలీ మద్యం వల్ల మాత్రం తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top