బెజవాడలో స్కూల్‌ బస్సు బీభత్సం 

Lucky escape for several as Sri Chaitanya School Bus Rams Into vehicles - Sakshi

వాహనాలపై దూసుకెళ్లిన శ్రీ చైతన్య స్కూల్‌ బస్సు

ప్రమాదంలో పలువురికి గాయాలు

సాక్షి, అమరావతి బ్యూరో/సత్యనారాయణపురం: విజయవాడలో శ్రీ చైతన్య స్కూల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. బీఆర్‌టీఎస్‌ రహదారిపై డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ ఎదురుగా వెళ్తున్న పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అత్యంత రద్దీగా ఉన్న ఈ రహదారిలో ఉదయం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న ఉదయం 8 గంటలకు మారుతీనగర్‌ బ్రాంచికి చెందిన శ్రీ చైతన్య హైస్కూల్‌ బస్సు(ఏపీ16టీజే 6505)లో డ్రైవర్‌ పి.దుర్గారావు (30) విద్యార్థులను తీసుకొచ్చేందుకు బయల్దేరాడు. మారుతీనగర్‌ నుంచి రాజీవ్‌నగర్, సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ, సీతన్నపేట చేరుకుని విద్యార్థులను తీసుకొస్తున్నాడు. 

అక్కడి నుంచి 8.22 గంటల సమయంలో బీఆర్‌టీఎస్‌ రహదారిలో ఉన్న శారదా కళాశాల సెంటర్‌కు చేరుతున్న సమయంలో రోడ్డు రద్దీగా ఉన్నప్పటికీ డ్రైవర్‌ బస్సును నిలిపే ప్రయత్నం చేయకుండా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు తొలుత ట్రాఫిక్‌ బారికేడ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, పండ్లు విక్రయించే రిక్షాను, ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆ వాహనాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కృష్ణలంకకు చెందిన  పండ్ల వ్యాపారి షేక్‌ మస్తాన్‌వలీ (66) తీవ్రంగా గాయపడగా స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డాడు. అలాగే నజీర్‌ అహ్మద్‌కు చెందిన ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో డ్రైవర్‌ బస్సును రహదారిపైనే విడిచిపెట్టి పరారయ్యాడు. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రేన్‌ సాయంతో బస్సును స్టేషన్‌కు తరలించారు. 

హాల్డ్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే.. 
శ్రీ చైతన్య హైస్కూల్‌ బస్సును ప్రతిరోజూ తీసుకెళ్లే డ్రైవర్‌ శుక్రవారం ఉదయం రాకపోవడంతో హాల్టింగ్‌ డ్రైవర్‌గా దుర్గారావు విధుల్లోకి వచ్చాడు. ఉదయం బస్సును తీసుకెళ్లి తిరిగి స్కూల్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. బస్సు కండీషన్‌లోనే ఉందని.. బస్సును పరిశీలించిన రవాణా శాఖ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ జయచంద్రబాబు ‘సాక్షి’కి తెలిపారు. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కాలేదని.. ఇంజన్‌ కండిషన్‌ కూడా బాగా ఉందని ఆయన వివరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top