‘మాకే తప్పుడు సమాచారం ఇస్తారా?’

IMD Wrong Weather Report Maharashtra Farmers Filed Case - Sakshi

సాక్షి, ముంబై: వర్షాలు పడకపోవటతో వాతావరణ శాఖపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈసారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్నిరోజుల క్రితం ప్రకటించింది. దీంతో మరాఠ్వాడా ప్రాంతానికి(మహారాష్ట్ర) చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వర్షాలు కురవకపోటంతో ఆగ్రహించిన అన్నదాతలు.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్(పుణె )పై పర్బానీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

వర్షపాతంపై వాతావరణ శాఖ సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని.. ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై వాతావరణ శాఖ అధికారులు తప్పుడు అంచనాలను ఇచ్చారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతు సంఘం ‘స్వాభిమాని షేట్కారీ సంఘటన’  చీఫ్ మానిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులను ఆశ్రయించారు. ఐఎండీ అధికారులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.

గతేడాది జూన్‌లో బీడ్‌ జిల్లా వాసులు కూడా ఇలాంటి ఫిర్యాదే చేయగా.. పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉంటే ‘వర్షాలపై  తప్పుడు సమాచారంతో రైతులకు తీరని నష్టం చేశారంటూ’ వాతావరణ శాఖపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌.. గతేడాది సెప్టెంబర్‌లో పర్యావరణ మంత్రిత​త్వ శాఖకు ఓ లేఖ రాశారు కూడా.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top