మహిళ దారుణ హత్య

Husband Killed Wife in Visakhapatnam - Sakshi

రెండు రోజుల కిందటే హతమార్చినట్లుగా అనుమానం  

రక్తపు మడుగులో మృతదేహం  

వివరాలు సేకరించిన డాగ్‌ స్క్యాడ్, క్లూస్‌ టీం

సీతమ్మధార (విశాఖ ఉత్తర) : ఫోర్తుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి అక్కయ్యపాలెంలోని మునసుబు వారి వీధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైయింది. మృతురాలి సోదరి పద్మ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన దేవరాపల్లి అప్పలనర్సమ్మ(38)కు సామాళ్లుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో గొడవులు జరగడంతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకుని ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అప్పలనర్సమ్మ ప్రస్తుతం హెల్త్‌కేర్‌లో పనిచేస్తుంది. విడాకుల సమయంలో భరణం కింద నగదు ఇవ్వడానికి భర్త ఒప్పకున్నా కొన్ని నెలలుగా సరిగ్గా ఇవ్వడంలేదు. దీంతో అప్పలనరసమ్మ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భరణం చెల్లించకపోవడంతో కోర్టు సామాళ్లుకు 30 రోజుల  రిమాండ్‌ విధించింది. కొద్ది రోజుల కిందటే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పలనర్సమ్మ ఫోన్‌ ఆదివారం నుంచి స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆమె సోదరి పద్మ అనుమానంతో మంగళవారం ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడం.., లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సాయంతో ఇంటి తాళం పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పలనర్సమ్మ రక్తపుమడుగులో ఉండడంతో వెంటనే 100 నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. ఫోర్తుటౌన్‌ సీఐ ఈశ్వరరావు తన బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం పక్కన లభించిన కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల, చెవుల మీద గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మెడలో పుస్తెల తాడు లేకపోగా, కిందన రెండు పుస్తెలు లభించాయి. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

తనిఖీలు చేస్తున్న డాగ్‌స్క్వాడ్‌ 
భిన్న కోణాల్లో దర్యాప్తు  
ఘటనా స్థలిలో వివరాలు సేకరించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఆమె కాల్‌డేటాను పరిశీలించి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలి భర్త సామాళ్లుని అదుపులోకి తీసుకొని విచారించామని, ముఖ్యంగా శనివారం రాత్రి 8గంటల తరువాత ఏం జరిగింది అన్న కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. మరోవైపు శనివారం రాత్రి అక్కతో తాను మాట్లాడానని అప్పలనర్సమ్మ సోదరి పద్మ పోలీసులకు తెలిపింది. భరణం కేసులో జైలుకు వెళ్లి వచ్చిన సామాళ్లు అక్క అప్పలనర్సమ్మకు ఫోన్‌ చేసి... నీకు ప్రతి నెలా భరణం చెల్లించలేకపోతున్నాను... నిన్ను హతమారిస్తే తలనొప్పి పోతుందని బెదిరించినట్లు చెప్పిందన్నారు. మరుసటి రోజు నుంచి అక్క ఫోన్‌ పనిచేయడం మానేసిందని.. ప్రస్తుతం విగతజీవిగా మారిందని పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top