ఫ్రాన్స్‌ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 11:07 AM

France Celebrations Marred As Two Fans Die And Cops Fire Tear Gas  - Sakshi

పారిస్‌ : విశ్వవేదికపై ఫ్రాన్స్‌ త్రివర్ణం ఉవ్వెత్తున ఎగరడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో వారు పారిస్‌ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకల్లో విషాదం నెలకొంది. అభిమానుల సంబరాలు శృతి మించడంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో రంగప్రవేశం చేసిన రియోట్‌ పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ గన్స్‌(జల ఫిరంగులు)లు ఉపయోగించి చెల్లా చెదురు చేశారు. అయితే ఈ ఘటనల్లో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ​క్రొయేషియాతో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ 4-2తో నెగ్గి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 

ఈ విజయానంతరం లక్షల మంది అభిమానులు నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చి తమ జట్టు విజాయాన్ని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ జట్టు విజయానికి సూచికగా వేలమంది అభిమానులు పిరమిడ్‌ రూపంలో నిలబడ్డారు. రోడ్లపై పాటలు పాడుతూ.. డ్యాన్స్‌లు చేశారు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే ఓ 50 ఏళ్ల అభిమాని అత్యుత్సాహంగా కెనాల్‌పై నుంచి దూకడంతో మెడలు విరిగి మృతి చెందాడు. మరొక 30 ఏళ్ల అభిమాని విజయానందంలో కారు నడుపుతూ చెట్టుకు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు.

ఇక మరో వైపు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులు షాప్‌లపై దాడులు చేస్తూ ఆస్తుల ధ్వంసానికి ప్రయత్నించారని, దీంతో వారిని అడ్డుకోగా కవ్వింపు చర్యలకు పాల్గొన్నారని రియోట్‌ పోలీసులు పేర్కొన్నారు. అభిమానులు రాళ్లతో దాడిచేయడంతోనే తాము టియర్‌ గ్యాస్‌, వాటర్‌ క్యాన్‌లు ఉపయోగించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇక పోలీసులు దాడిలో చాలా మంది గాయపడ్డారు. సంతోషం కాస్త విషాదంగా మారడంతో పోలీసులు రవాణ వ్యవస్థను నిలిపివేశారు. రోడ్లపై ఎలాంటి వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధించారు. ఆఖరికి మెట్రో ట్రైన్‌లను ఆపేశారు. 4 వేల మంది పోలీసులను మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చె ప్రయత్నం చేశారు.

1/2

2/2

Advertisement
Advertisement