వితంతువుకు అదనపు కట్నం వేధింపులు

Extra Dowry Harassments Widow Suicide In Karnataka - Sakshi

బలవన్మరణం చెందిన బాధితురాలు

మండ్య: భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న వివాహితకు అత్తింటివారు అదనపు కట్నం పేరుతో వేధించారు. దీంతో మనో వేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ ఘటన బుధవారం జిల్లాలోని మద్దూరు తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని వళగెరెహళ్లి గ్రామానికి చెందిన వినయ్‌కు రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా హనుమంతపుర గ్రామానికి చెందిన అభిలాష(24)తో కొద్ది సంవత్సరాల క్రితం  వివాహమైంది. వినయ్‌ బెంగళూరు నగరంలో బీఎంటీసీ సంస్థలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. దంపతులు గత ఏడాది వరకు బెంగళూరులోనే ఉండేవారు. దంపతులకు పాప  జన్మించడంతో మద్దూరు పట్టణ శివార్లలో నివసిస్తున్న నానమ్మ, తాత ఇంటికి ఎదురుగా కాపురం పెట్టారు.

ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే వినయ్‌ తల్లితండ్రులు మమత, రాజు, మమత చెల్లెలు కవిత, ఆమె కుమార్తె స్మిత, కుమారుడు విజయ్‌కుమార్‌లు అదనపు కట్నం తేవాలంటూ అభిలాషను వేధించేవారు. దీనికితోడు వినయ్,అభిలాషల మధ్య కూడా గొడవ జరుగుతుండేవి. దీంతో మనస్థాపం చెందిన వినయ్‌ నెల రోజుల క్రితం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అ ప్పటికీ అత్తింట్లో అదనపు కట్నం వేధింపులు ఆగలేదు. దీంతో మనస్థాపం చెందిన అభిలాష బుధవారం నిద్రమాత్రలు మింగింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న అభిలాష చిన్నాన్న అశోక  గమనించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.  వైద్యుల సూచనమేరకు మైసూరుకు తరలిస్తుండగా   మార్గంమధ్యలో అభిలాష మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లితండ్రులు, బంధువులు అభిలాష  అత్త, మామలు, కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఘటనపై మద్దూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top