దక్షిణ మండల డీఎస్పీకి రిమాండ్‌

DSP Remand In Bribery Case East Godavari - Sakshi

రాజమహేంద్రవరం క్రైం: సివిల్‌ కేసు మాఫీ చేసేందుకు, నిందితుడిని అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేశాడనే అరోపణపై అరెస్టైన దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణరావుకు, అతడికి సహకరించిన కానిస్టేబుల్‌ రమేష్‌లకు సీబీఐ కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. రాజవోలు గ్రామానికి చెందిన తాడికొండ విల్సన్‌ కుమార్, సామర్లకోటకు చెందిన తాళ్లూరి కీర్తి ప్రియ ఇళ్లు విక్రయ విషయంలో అగ్రిమెంట్‌ చేసుకున్న తరువాత మరికొంత సొమ్ము ఇవ్వాలంటూ కోరడం, దీంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడంటూ ధవళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో కీర్తి ప్రియ విల్సన్‌ కుమార్‌ పై కేసు పెట్టింది.

ఈ కేసులో విల్సన్‌ కుమార్‌ అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు, కేసును మాఫీ చేసేందుకు దక్షిణ మండలం డీఎస్పీ రూ.రెండు లక్షలు డిమాండ్‌ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని డీఎస్పీ కార్యాలయంలో పని చేసే రమేష్‌ అనే కానిస్టేబుల్‌ ద్వారా సాగించారు. లంచం ఇచ్చుకోలేని విల్సన్‌ కుమార్‌ ఏసీబీ అధికారులను అశ్రయించడంతో గురువారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో రూ 55 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి కానిస్టేబుల్‌ రమేష్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. డీఎస్పీ నారాయణరావు, కానిస్టేబుల్‌ రమేష్‌పై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి 14 రోజులు చొప్పున రిమాండ్‌ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చారు. దీంతో నిందితులను సెంట్రల్‌ జైల్‌ కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top