వెంబడిస్తూ.. వీడియో తీస్తూ..

Detective Agency Chase Inter Girl And Taking Photos in Hyderabad - Sakshi

బాలిక గుణగణాలపై ఆరా తీసేందుకు

డిటెక్టివ్‌ ఏజెన్సీతో ఒప్పందం

డీఆర్‌డీఓ– జేఆర్‌ఎఫ్‌ నిర్వాకం

డిటెక్టివ్‌ ఏజెన్సీ నిర్వాహకుడు, అసిస్టెంట్‌తోపాటు

యువకుడి అరెస్టు జంట నగరాల్లో ప్రథమం

నేరేడ్‌మెట్‌: విద్యార్థినులు, బాలికల కదలికలను రహస్యంగా గమనిస్తూ..వీడియో, ఫోటోలు తీస్తూ... పెళ్లికి ముందే వారి గుణగణాలపై ఆరా తీస్తూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న డిటెక్టివ్‌ ఏజెన్సీ బండారం బట్టబయలైంది.  జంట నగరాల్లోనే ఈ తరహా కేసు నమోదు కావడం తొలిసారని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌భగవత్‌ తెలిపారు. బుధవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా ముదిరెడ్డిపల్లి, శివబాలయోగి నగర్‌కు చెందిన దేవంగ మహేష్‌ కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (మెకానికల్‌ ఇంజనీరింగ్‌)గా పని చేస్తూ బాలపూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలోని త్రివేణి నగర్‌ కాలనీలో ఉంటున్నాడు. చైతన్యపురిలోని ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినని ఇష్టపడుతున్న అతను ఆమెను తరచూ వెంబడిస్తున్నాడు.

సదరు బాలికతో మాట్లాడాలని..ఆమె దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేసినా పట్టించుకోలేదు. దీంతో సదరు విద్యార్థిని వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని భావించిన మహేష్‌ కొత్తపేట నాగోల్‌ రోడ్డు సమీపంలోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో ఉన్న స్కౌట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్కా కిరణ్‌కుమార్‌పు సంప్రదించాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విద్యార్థిని ఆమె వ్యక్తిగత సమాచారంతోపాటు గుణగణాలు, బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా? తదితర వివరాలు సేకరించాలని కోరాడు. ఇందుకు గాను రూ.17వేలతో ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా డిటిక్టెవ్‌ ఏజెన్సీలో అడ్మిన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న బాతుల సుహాసిని సదరు విద్యార్థిని వెంబడిస్తూ వీడియో చిత్రీకరిస్తూ, ఫోటోలు తీస్తూ, ఆమె సెల్‌  నంబర్‌ను సేకరించి మహేష్‌కు అందజేశారు. అంతేగాక కిరణ్‌కుమార్, సుహాసిని కళాశాలకు వచ్చి విద్యార్థి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అనుమానం వచ్చిన ప్రిన్సిపాల్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  కుటుంబ సభ్యులు ఈ విషయమై నిలదీయగా సదరు విద్యార్థిని పెళ్లి చేసుకునేందుకు మహేష్‌ కోరిక మేరకు వివరాలు సేకరించినట్లు తెలిపారు.  అయితే ఆమె మైనర్‌ కావడం రహస్యంగా వెంబడిస్తూ వీడియో, ఫొటోలు తీయడాన్ని అవమానంగా భావించిన ఆమె కుటుంబసభ్యులు  ఈనెల 31న చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు మహేష్, కిరణ్‌కుమార్, సుహసినిలను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఒక ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌  డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ పృథ్వీదర్‌రావు, సీఐ సుదర్శన్, ఎస్‌ఐ సాయిప్రకాష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌
సమాచారం తెలుసుకునే అధికారం లేదు: సీపీ
వివాహానికి ముందు అమ్మాయిల వ్యక్తిగత సమాచారం,  తెలుసుకునే అధికారం డిటెక్టివ్‌ ఏజెన్సీలకు లేదని సీపీ తెలిపారు.  లేబర్‌ లైసెన్స్‌ తీసుకొని స్కౌట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. ఇప్పటి వరకు పలువురి  వివరాలు సేకరించినట్లు వెల్లడైందన్నారు. మహిళలు, యువతులను వెంబడిస్తూ వారి సమాచారం  సేకరించడం, అవమానకరంగా వ్యవహరించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top