విద్యార్థి ఉసురు తీసిన ‘కేసు’

Degree Student Commits Suicide in Siddipet  - Sakshi

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

కేసు పెట్టిన వారి పేర్లు చెప్పాలని బంధువుల ఆందోళన

సిద్దిపేటలో ఉద్రిక్తత

సిద్దిపేటటౌన్‌ : తోటి స్నేహితులతో జరిగిన చిన్నపాటి గొడవ పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లి కేసు కావడంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్‌ మండలం రావురూకులకు చెందిన మడప రోహిత్‌రెడ్డి అలియాస్‌ బబ్లూ (18) సిద్దిపేట పట్టణంలోని మాస్టర్స్‌ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

మంగళవారం పాత బస్టాండ్‌ పక్కన ఉన్న గల్లీలో అతడికి, కొందరు స్నేహితులకు చిన్నపాటి ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. పెద్దల సమక్షంలో ఇరు పక్షాల వారిని మందలించి ఉదయం మళ్లీ స్టేషన్‌కు రావాలని పంపించారు. మంగళవారం రాత్రి రోహిత్‌ ఇంటికి వెళ్లకుండా గ్రామ శివారులోని వారి సంబందీకులకు చెందిన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.

రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గ్రామంలో వెతికినా ఆచూకీ దొరకలేదు.  రోహిత్‌ తండ్రి యాదిరెడ్డి ఉదయం బావి వద్దకు వెళ్తున్న క్రమంలో దొంగల చంద్రయ్య బావి వద్దకు చేరుకోగానే అక్కడే ఉన్న కానుగు చెట్టుకు ఉరివేసుకుని రోహిత్‌ చనిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విషయం సిద్దిపేట రూరల్‌ పోలీసులకు తెలియడంతో పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. 

దోషుల పేర్లు చెప్పాలని బాధితుల డిమాండ్‌..

తమ కుమారుడి మృతికి మంగళవారం జరిగిన గొడవే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆస్పత్రి వద్ద ఆందోళన చేసినా పోలీసులు గొడవకు పాల్పడిన అతని స్నేహితుల పేర్లు చెప్పకపోవడంతో శవంతో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేయడానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. కొద్ది దూరంలో వారిని పోలీసులు అడ్డుకోగా అక్కడే బైటాయించి ఆందోళనకు దిగారు.

రోహిత్‌రెడ్డి మృతికి కారణమైన వారి పేర్లు చెప్పి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీ జోయల్‌ డేవిస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్నే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ వినకపోవడంతో ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శవాన్ని పోలీసుల వాహనంలో తిరిగి పోస్టు మార్టం రూంకు తీసుకువచ్చారు. కాసేపటికి అడిషనల్‌ డీసీపీ నర్సింహారెడ్డి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని కోరడంతో గొడవ సద్దుమనిగింది. గొడవకు కారణమైన వారిపై సైతం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌ తెలిపారు.

దోషులను కఠినంగా శిక్షించాలి...

మా కొడుకు మీద ఫిర్యాదు వచ్చింది పోలీస్‌ స్టేషన్‌కు రావాలని మంగళవారం సాయంత్రం సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. స్టేషన్‌కు వస్తే బుధవారం ఉదయం రావాలని చెప్పి పోలీసులు పంపించారు. వెళ్లే సమయంలో కేసు అయింది స్టేషన్‌కు రావాలి, జైలుకు పంపిస్తాం అని చెప్పారు. కేసు నమోదు కావడంతోనే మనస్థాపం చెంది నా కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు పెట్టిన వారు ఎవరో మాకు చెప్పకుండా పోలీసులు దాస్తున్నారు. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని మాకు అన్యాయం చేస్తున్నారు. గొడవ ఎందుకు అయ్యిందో చెప్పడం లేదు. మా అబ్బాయి మీద కేసు పెట్టిన వారి వివరాలు చెప్పాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 

– యాదిరెడ్డి, మృతుని తండ్రి

చట్ట ప్రకారం చర్యలు..

రోహిత్‌రెడ్డి తన స్నేహితునితో కలిసి పాత బస్టాండ్‌ వద్ద వారు చదువుకునే కాలేజీ స్నేహితులతో గొడవ పెట్టుకుని వారిని కొట్టాడు. వారు వచ్చి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారి పెద్దలను పిలిపించి మాట్లాడి కోర్టుకు పిలిచినపుడు రావాలని చెప్పి పంపించాం. అమ్మాయి విషయంలో స్నేహితుల మద్య గొడవ జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. పంపించిన తర్వాత రోహిత్‌ ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయంలో అతనిపై కేసు నమోదు అవడం వల్లనే మనస్థాపం చెంది చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 

– రామేశ్వర్, సిద్దిపేట ఏసీపీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top