హాజీపూర్‌ కేసుల్లో శ్రీనివాస్‌రెడ్డికి మరణశిక్ష

Death Sentence To Hajipur Convict - Sakshi

తీర్పునిచ్చిన నల్లగొండలోని పోక్సో కోర్టు..

అత్యాచారం, హత్యకేసుల్లో నిరూపితమైన నేరం

రెండు కేసుల్లో ఉరిశిక్ష.. మరో కేసులో యావజ్జీవం

ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ కేసుల్లో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడింది. నల్లగొండ లోని పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే పూడ్చిపెట్టిన ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డిపై ఎట్ట కేలకు పోలీ సులు నేర నిరూపణ చేశారు. ఇద్దరు బాలికల కేసుల్లో ఉరిశిక్ష, మరో బాలిక కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం జడ్జి సిద్ధ వేద విద్యానాథరెడ్డి గురువారం సాయంత్రం 6.24 గంటలకు తుదితీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఎగువ కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పిం చారు. ఈ కేసులో ప్రభుత్వం ప్రత్యే కంగా స్పెషల్‌ ప్రాసి క్యూటర్‌గా చంద్రశేఖర్‌ను నియమించగా, ఆయన రాచ కొండ కమిషనరేట్‌ పోలీసుల తరఫున వాదించారు.

శ్రీనివాస్‌ రెడ్డి తరఫున వాదిం చడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో న్యాయ సహాయం అందిం చేందుకు లీగల్‌ సెల్‌ అథారిటీ ఠాగూర్‌ను న్యాయవాదిగా నియమించారు. శ్రీనివాస్‌రెడ్డికి ఎగువ కోర్టులోనూ ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 27నే తుది తీర్పు వెలువడాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల తీర్పు వాయిదా పడింది. గురువారం తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలోనే ఉన్న బాలిక తండ్రి నర్సింహ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.. ‘మా కడుపు కోత తీరదు. ముద్దాయికి ఉరి శిక్ష పడటంతో న్యాయం జరిగింది. శిక్ష వేయించడంలో పోలీ సులు అన్న మాట నిలబెట్టుకున్నారు’అని వ్యాఖ్యానించారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డిని గురు వారం రాత్రి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top