ఖాకీ..కలవరం పైసా వసూల్‌..

Corruption In Police Department - Sakshi

సిటీ పోలీస్‌ ఆఫీస్‌లో ఇష్టారాజ్యం

సెక్షన్లలో సిబ్బంది చేతివాటం

ఏళ్ల తరబడి ఒకే చోట కొలువు

ఔట్‌ సోర్సింగ్‌ పేరిట తిష్ట వేసిన రిటైర్డ్‌ ఉద్యోగులు

కాసులిస్తేనే ఫైళ్ల కదలిక

వరంగల్‌ క్రైం: శాంతి భద్రతలను కాపాడడం.. నేరాలను అదుపు చేయడంలో పోలీస్‌ శాఖది కీలకపాత్ర. పోలీసులు 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. నేరస్తుల్లో వణుకు తెప్పించి నిజాలు కక్కిస్తుంటారు. అలాంటి ఖాకీలను సైతం కొందరు భయపెడుతున్నారు. పైసలిస్తేనే పని.. లేకుంటే ఫైలు కదలదని మొహమాటం లేకుండా చెబుతున్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారితో సైతం వంగి వంగి దండాలు పెట్టించుకుంటున్నారు. ఇది జిల్లాలో ఎక్కడో మూలకు ఉన్న ప్రాంతంలో జరుగుతోందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నగరం నడిసెంటర్‌లో.. అందులోనూ పోలీస్‌ కమిషనరేట్‌లోని సిటీ పోలీస్‌ ఆఫీస్‌ (సీపీఓ)లో చోటుచేసుకుంటున్న నిత్యబాగోతం.పోలీసు శాఖలో హోంగార్డు నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు  సర్వీస్, వేతనాలతో పాటు ప్రతి విషయం సిటీ పోలీసు కార్యాలయంతోముడిపడి ఉంది.

దీన్ని ఇక్కడ పనిచేసే కొంత మంది సిబ్బంది ఆసరాగా చేసుకుని.. ఏళ్ల తరబడి తిష్టవేసి అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఫలితంగా వివిధ ఫైళ్ల పేరిట నిత్యం వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. ప్రతి ఫైలుకు రేటు ఫిక్స్‌ చేసి పోలీసులు, అధికా రుల నుంచి వసూలు చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘ఏంటి నువ్వు ఎక్కడా తీసుకోవడం లేదా, నీ జాతకం తియ్యమంటవా.. ఫైల్‌ ఎక్కడ ఉందో కనీసం నీకు తెలుసా..’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు, అధికారులు సీపీఓ కార్యాలయంలో అడుగుపెట్టామా.. పైసలు ఇవ్వాలి.. పనులు చేసుకోవాలని మానసికంగా సిద్ధపడుతున్నారు. అయి తే.. క్రమశిక్షణ, నిజాయితీతో ఉద్యోగం చేస్తున్న కొంత మంది పోలీస్‌ అధికారులు, కానిస్టేబుళ్లు ఇబ్బందులు ప డుతున్నారు. న్యాయంగా రావాల్సిన అలవెన్స్‌లు రాక.. సీపీఓ చుట్టూ తిరగలేక నరకం అనుభవిస్తున్నారు.

అసిస్టెంట్లకే అసిస్టెంట్లు
సీపీఓలో పనిచేసే కొంత మంది జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు కంప్యూటర్‌ విద్య రాదనే కారణంతో కమిషనరేట్‌ పరిధిలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న కొందరు కానిస్టేబుళ్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇది పేరుకు మాత్రమే.. పైళ్ల మూవ్‌మెంట్‌ చెప్పి వారి చేత వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంత మంది మరో అడుగు ముందుకేసి ఆ కానిస్టేబుళ్లను ఇంటి పనులకు, ఇంటి నుంచి కార్యాలయానికి తీసుకురావడం, తీసుకుపోవడానికి వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. సీపీఓలో సుమారు 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నట్లు సమాచారం.

సెక్షన్లలో చేతివాటం..
సీపీఓ కార్యాలయంలో ఐదు సెక్షన్లు ముఖ్యమైనవి. ఇందులో వివిధ హోదాలో పనిచేస్తున్న కొంత మంది సిబ్బంది పైసలు ముడితే తప్ప ఫైళ్ల ముఖం చూడని పరిస్థితి నెలకొంది. కానిస్టేబుళ్లు, అధికారుల సర్వీస్‌ సంబంధ విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా..  ఇంక్రిమెంట్లు, అలవెన్స్‌లు పద్ధతి ప్రకారం రావాలన్నా ముందుస్తుగా వీరికి కానుకలు సమర్పించాల్సిందే. కొంత మంది ముందుస్తుగా కలవకుంటే వారి ఫైళ్లు మాయమైనట్లే. అయితే అసిస్టెంట్లకే అసిస్టెంట్లుగా వ్యవహరిస్తున్న వారు వ్యవహారం చక్కబెట్టి.. రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లు సాఫీగా జరిగేలా చూస్తున్నట్లు తెలిసింది.

కీలకమైన సెక్షన్లలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు..
గతంలో పోలీస్‌ శాఖ కార్యాలయంలో పనిచేసి రిటైర్డ్‌ అ యిన ఉద్యోగులను ఉన్నతాధికారులు ఔట్‌ సోర్సింగ్‌ వి« దానంపై తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు అక్రమ సంపాదనకు దారులు వేసుకున్నారు. కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారికి ఫైళ్లపై అవగాహన లేకపోవడం.. పైళ్లను సరిగా రాయలేకపోవడం.. అక్రమార్కులకు కలిసివస్తోంది. దీంతో అనీ ్న తామై నడిపిస్తున్నారు. ఒక్కో ఫైలుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. రిటైర్డ్‌ అయినా.. కీలకమైన సెక్షన్లలో వీరిదే అధిపత్యం కొనసాగడం గమనార్హం. 

కొన్ని ఉదాహరణలు
కారుణ్య నియామకాల కింద 2015లో ఒకరు ఉద్యోగంలో చేరారు. సాధారణంగా ప్రొబేషన్‌ పీరియడ్‌ రెండేళ్లు ఉంటుంది. కానీ.. మూడు సంవత్సరాలు దాటినా ప్రొబేషన్‌ పూర్తయినట్లు డిక్లేర్‌ చేయలేదు. మూమూళ్లు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందికి వేతనంతో పాటు 30 శాతం వేతనాన్ని అదనంగా ఇస్తోంది. ఇలా అదనపు వేతనం తీసుకుంటూ కొంత మంది కానిస్టేబుళ్లు సీపీనో కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు.
కానిస్టేబుళ్లు, అధికారులకు అందాల్సిన సర్వీస్‌ సంబంధ విషయాల్లో అవసరం లేకున్నా.. సమస్యలు సృష్టించి కొంత మంది సిబ్బంది ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కాసుల కోసమే సీపీఓ సిబ్బంది పలువురు అలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కానిస్టేబుళ్ల పదోన్నతుల జాబితాలను సీపీఓలోని పలువురు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.  
కొంత మంది సీపీఓ ఉద్యోగులు ఉన్నతా అధికారుల అండదండలతో సంవత్సరాలు తరబడి నిబంధనల కు విరుద్ధంగా ఇక్కడి కార్యాలయంలోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి విడుదలయ్యే ఉత్తర్వులను సైతం వీరికి అనుకూలం గా మార్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top