జీఎస్టీ వలలో పచ్చ ‘చేప’

Company Of TDP Did Fraud In GST - Sakshi

షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి భారీగా పన్ను ఎగవేత 

టీడీపీ ఎంపీకి చెందిన కంపెనీ ఘరానా మోసం

కాగితపు లావాదేవీల సామర్థ్యం చూపి రూ. 700 కోట్ల మేర బ్యాంకు రుణాలు

జీఎస్టీ అధికారుల తనిఖీల్లో గుట్టురట్టు

ఓ షెల్‌ కంపెనీ ఎండీ అరెస్టు, రిమాండ్‌కు తరలింపు

రూ. 2 వేల కోట్ల మేర మోసం జరిగినట్లు అంచనా

రూ. 500 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టి ఉండొచ్చంటున్న జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఏమీ కొనలేదు... ఎక్కడా అమ్మలేదు... అసలు వ్యాపారమే జరగలేదు... కానీ కాగితాలపై మాత్రం కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగినట్లు సృష్టించారు. ప్రభుత్వం నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కింద వందల కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) రాబట్టారు. దీన్ని ఆసరాగా చేసుకొని బ్యాంకుల నుంచి వందల కోట్ల రుణం తీసుకున్నారు. ఆ షెల్‌ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయని రుణం ఎగ్గొట్టే ప్లాన్‌ చేశారు. కానీ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు జరిపిన వరుస తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. ఇదంతా టీడీపీకి చెందిన వ్యాపార ప్రముఖుడైన రాజ్యసభ సభ్యుడు, ఓ కేంద్ర మాజీ మంత్రికి చెందిన కంపెనీ నిర్వాకమని తెలుస్తోంది. ఆ కంపెనీకి షెల్‌ కంపెనీలతో ఉన్న లింకులను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌లో ఇప్పటికే ఓ షెల్‌ కంపెనీకి చెం దిన మేనేజింగ్‌ డైరెక్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరో డైరెక్టర్‌ను అరెస్టు చేయాలని  ఆదేశాలిచ్చినా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 

ఏం జరిగిందంటే...! 
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో కొనుగోలు చేసిన సరుకులను మరో రాష్ట్రంలో అమ్మినప్పుడు ఆ సరుకులపై విధించే జీఎస్టీని ముందుగా సరుకు అమ్మిన రాష్ట్రానికి చెందిన వ్యాపారి చెల్లిస్తాడు. ఆ తర్వాత మరో రాష్ట్రంలో ఆ సరుకులను వినియోగదారుడికి అమ్మిన వ్యాపారి కూడా జీఎస్టీ చెల్లిస్తాడు. అయితే ముందుగానే పక్క రాష్ట్రంలో అమ్మిన వ్యాపారి పన్ను చెల్లించి ఈ రాష్ట్ర వ్యాపారికి విక్రయిస్తాడు కనుక ఈ రాష్ట్రంలో అమ్మిన వ్యాపారికి తాను చెల్లించిన పన్నును ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పేరుతో ప్రభుత్వం మళ్లీ తిరిగి ఇచ్చేస్తుంది. అంటే ఒక వస్తువుపై ప్రభుత్వం ఒకసారి మాత్రమే పన్ను వసూలు చేస్తుంది. దీని ప్రకారం రెండోసారి పన్ను చెల్లించిన వ్యాపారి తిరిగి దాన్ని పొందుతాడు. దీన్ని ఆసరాగా చేసుకునే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ కంపెనీ గత 18 నెలలుగా పెద్ద ప్లాన్‌కు శ్రీకారం చుట్టిందని హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాలు వెల్లడించాయి.

జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాలు వెల్లడించిన ప్రకారం... ఈ ప్లాన్‌ అమలులో భాగంగా ముందుగా 8 షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీల ద్వారా వ్యాపార లావాదేవీలు జరిగాయని, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయని ఇన్వాయిస్‌లు సృష్టించారు. కానీ అక్కడ నిజంగా వ్యాపారం జరగలేదు. కేవలం కాగితాలపైనే రూ. కోట్లలో వ్యాపార లావాదేవీలు జరిగినట్లు చూపించారు. ఈ వ్యాపారంపై ఓ షెల్‌ కంపెనీ నుంచి అమ్మిన సరుకులకు జీఎస్టీ కట్టినట్లు, కొన్న కంపెనీ కూడా మళ్లీ జీఎస్టీ కట్టినట్లు కాగితాలపై చూపించారు. అప్పుడు కొన్న కంపెనీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద తాము కట్టిన పన్నును పొందొచ్చు కనుక దాన్ని క్లెయిమ్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ వర్గాలు తెలిపిన ప్రకారం ఇలా మొత్తం రూ. 1,284 కోట్ల వ్యాపార లావాదేవీలు చూపించి రూ. 225 కోట్ల మేర ఐటీసీ కింద ప్రభుత్వం నుంచి పొందారు. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఈ వ్యవహారంలో మొత్తం రూ. 2 వేల కోట్ల మేర కాగితపు లావాదేవీలు జరిగి ఉంటాయని, రూ. 500 కోట్ల వరకు ఐటీసీ కింద లబ్ధి పొంది ఉంటారని జీఎస్టీ కమిషరేట్‌ వర్గాలంటున్నాయి. 

లావాదేవీల ఆధారంగా రుణాలు... 
కాగితపు లావాదేవీలపై ప్రభుత్వం నుంచి పొందిన రూ. 225 కోట్ల మేర ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించిన పత్రాలను మరో మోసానికి ఉపయోగించుకున్నారు. ఈ లావాదేవీల సామర్థ్యాన్ని గ్యారంటీగా చూపించి రూ. 700 కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చూపించి వాటిని మూసివేసే ప్రయత్నమూ చేశారు. కానీ, జీఎస్టీ అధికారులు జరిపిన వరుస తనిఖీల్లో దొరికిపోయారు. ఇప్పుడు ఒక్కో షెల్‌ కంపెనీ డైరెక్టర్లను అరెస్టు చేసే పనిలో పడ్డారు జీఎస్టీ అధికారులు.  

ఒకరి అరెస్టు, మరొకరి అరెస్టుకు ఆదేశాలు... 
జీఎస్టీ చట్టం ప్రకారం రూ. 5 కోట్లకు మించి పన్ను ఎగవేతకు పాల్పడిన వారిని అరెస్టు చేసే అధికారం ఉండటంతో ఈ షెల్‌ కంపెనీల ఎండీలను అరెస్టు చేసే పనిలో జీఎస్టీ అధికారులున్నారు. అందులో భాగంగా భరణి కమాడిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఎండీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. బీఆర్‌ఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌ ఎండీని కూడా అరెస్టు చేయాలనే ఆదేశాలున్నా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సదరు టీడీపీ ఎంపీ జీఎస్టీ అధికారుల దర్యాప్తును అడ్డుకునేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ షెల్‌ కంపెనీల్లో ఓ కంపెనీ డైరెక్టర్‌ను తన ఇంట్లోనే పెట్టుకొని అరెస్టు కాకుండా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top