విదేశాల్లో ఉద్యోగం: 230 మందికి టోకరా

Company Cheats Unemployed In The Name Of Fake Foreign Jobs In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: నిరుద్యోగుల ఆశలను సొమ్ము చేసుక్ను మరో సంస్థ బోర్డు తిప్పేసింది. వరంగల్‌ దేశాయిపేటలోని ట్రిమ్‌విజన్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ ముందు వందల మంది బాధితులు బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగే వరకు కూడా నిర్వాహకులు చేసిన మోసం బయటపడలేదు. ‘విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తాం.. నూరు శాతం ఉద్యోగం గ్యారంటీ.. దుబాయ్, అమెరికా ఏ దేశమైనా సరే ఉద్యోగానికి మాది భరోసా’ అని ట్రీమ్‌ విజన్‌ సంస్థ చేసిన ప్రకటనలకు మోసపోయిన నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. వందలాది మంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి విదేశాలకు చెక్కేసిన నిర్వాహకుల తీరు నిరుద్యోగులను కంట తడి పెట్టిస్తోంది.

రూ.20వేల నుంచి రూ.60వేల వరకు
వరంగల్‌ దేశాయిపేటలో ట్రిమ్‌విజన్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ పేరిట మట్టెవాడకు చెందిన సీ.హెచ్‌.స్నేహలత కార్యాలయాన్ని తెరిచారు. దుబాయిలో ఉద్యోగం... రూ.వేలు, రూ.లక్షల్లో వేతనాలు అంటూ ఊరించి సుమారు 230 మంది నుంచి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు అందినంత వసూలు చేశారు. స్థానికురాలే కావడంతో నగరానికి చెందిన పలువురు నమ్మి డబ్బు అప్పగించారు. గత ఎనిమిది నెలలుగా నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపి డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బుతో పాటు అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్టులు, కూడా తీసుకున్నారు. ఇదిగో వీసా.. అదిగో వీసా అంటూ సుమారు ఆరు నెలలుగా నమ్మించి కాలయాపన చేశారు. ట్రీమ్‌ విజన్‌ సంస్థ కార్యాలయం చుట్టూ నిరుద్యోగులు చెప్పులరిగేలా తిరుగుతుండగా.. నిర్వాహకులు రూ.60 లక్షలతో దుబాయికి ఉడాయించినట్లు అందిన సమాచారంతో కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగారు.

ఉన్న ఉద్యోగం వదిలి..
దుబాయిలో ఉద్యోగం వస్తుంది.. రేపో.. మాపో వీసా రానుందనే నమ్మకంతో పలువురు ఇక్కడ చేస్తున్న ఉద్యోగాలను కూడా వదిలేశారు. ఇప్పుడు నిర్వాహకులు బోర్డు తిప్పేసినట్లు తెలియడంతో బాధితులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు రంగంలో దిగి బాధితులను శాంతింపచేశారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బాధితులు ఫిర్యాదు చేస్తే సంస్థ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేశాం...
ట్రీమ్‌ విజన్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వాహకులు సుమారు 230 మంది నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇందులో సుమారు 30 మందికి డబ్బు తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన బాధితులు ఆందోళనకు దిగగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్వాహకురాలు సీహెచ్‌.స్నేహలతపై కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం. 
– అశోక్‌కుమార్, ఇంతేజార్‌గంజ్‌ ఎస్సై

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top