నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Boy Died In Park Gyro wheel - Sakshi

బే వాచ్‌ పార్కులో గైరావీల్‌ నుంచి పడి బాలుడి మృతి

నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తీవ్ర ఆరోపణలు

విశాఖపట్నం∙, భీమునిపట్నం: బే వాచ్‌ పార్కు నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పదకొండేళ్లకే బాలుడికి నూరేళ్లు నిండిపోవడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అనుమతి లేకుండా గైరావీల్‌ ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షణ లేకుండా బే వాచ్‌ పార్కు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కె.నగరపాలెం పంచాయతీ చిన మంగమారిపేటకు చెందిన మైలిపల్లి శివదేవాస్‌(11) రమాద్రి వద్ద ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి మైలిపల్లి శ్రీనివాస్‌ కూలి పనులు చేస్తుండగా తల్లి దేవి భీమిలి బీచ్‌ రోడ్డులోని తొట్లకొండ ఎదరుగా ఉన్న బే వాచ్‌ పార్కులో పని చేస్తుంది. బుధవారం స్కూల్‌కి సెలవు కావడంతో తల్లితో కలిసి శివదేవాస్‌ పార్కుకు వెళ్లాడు.

అక్కడ విద్యుత్‌తో తిరిగే గైరా వీల్‌ ఉంది. అందులో పిల్లలు కూర్చుంటే కిందకు మీదకు తిరుగుతుంది. బాలుడి తల్లి పనిలో ఉండగా శివదేవాస్‌ దానిపైకి ఎక్కి తిరగడానికి ప్రయత్నించాడు. దీంతో అదుపు తప్పి కింద పడిపోవడంతో దాని రాడ్డుకు తల బలంగా తగలడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి తల్లి దేవి తల్లడిల్లిపోయి కన్నీరుమున్నీరైంది. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా చనిపోయిన బాలుడు పెద్ద కొడుకు. చిన్నవాడు జగన్‌ మూడో తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే...
ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న బే వాచ్‌ పార్కులో గైరా వీల్‌ నిర్వహించడానికి అనుమతి ఉండాలి. అలాగే దీన్ని తిప్పడానికి అనుభవం ఉన్న ఆపరేటర్‌ ఉండాలి. అయితే దీనికి అనుమతిగానీ ఆపరేటర్‌గానీ లేరని తెలిసింది. ముఖ్యంగా దీని వద్దకు పిల్లలు వెళ్లకుండా తప్పనిసరిగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే శివదేవాస్‌ దానిపైకి ఎక్కినా ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాలుడు చనిపోయినా నిర్వహకులు పెద్దగా స్పందించ లేదు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top