డాక్టర్ల నిర్లక్ష్యానికి పసికందు బలి

Baby Boy Died With Doctors Negligence in PSR Nellore - Sakshi

సిజేరియన్‌ కాన్పు చేసిన కాసేపటికే మృతి

దహన సంస్కారం చేసే సమయంలో తల నుంచి రక్తం వచ్చిన వైనం

వైద్యుల నిర్లక్ష్యమే  కారణమంటున్న కుటుంబసభ్యులు

ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన  

కేసు నమోదు చేసిన దర్గామిట్ట పోలీసులు  

నెల్లూరు(బారకాసు): జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా కాన్పుచేసిన కొద్దిసేపటికే శిశువు (మగ) మృతిచెందింది. తమ బిడ్డ మృతికి కారణం ప్రభుత్వ వైద్యులేనని బాధితులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రసూతి విభాగంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కొత్తూరు సమీపంలో ఉన్న శ్రీలంకకాలనీకి చెందిన రవికుమార్‌ తన భార్య సోనీని కాన్పుకోసం ఈనెల 14వ తేదీ సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేర్పించాడు. వైద్యులు ఆమెను పరీక్షించి సాధారణ కాన్పు చేస్తామని తెలియజేశారు. 16వ తేదీ అర్ధరాత్రి సోనీకి నొప్పులు అధికం కావడంతో కాన్పుకోసం ఆపరేషన్‌ థియేటర్‌కి తీసుకెళ్లారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని సాధారణ కాన్పు చేయడం కష్టతరమని ఆపరేషన్‌ చేసి బిడ్డను తీయాల్సి వస్తోందని డాక్టర్లు రవికుమార్‌తోపాటు కుటుంబసభ్యులకు తెలిపారు. వారు సమ్మతించడంతో డాక్టర్‌ సోనీకి సిజేరియన్‌ ద్వారా కాన్పు చేసి బిడ్డను బయటకు తీశారు. శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పిన వైద్యులు మరో అర్ధగంట తర్వాత మృతిచెందిందని బాధితులకు అప్పగించారు. రవికుమార్‌ కుటుంబసభ్యులు బాధపడుతూ శిశువు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

రక్తం రావడంతో..
గురువారం ఉదయం శిశువుకు దహన సంస్కారాలు చేసే సమయంలో బిడ్డ తల నుంచి రక్తం కారుతుండడాన్ని గుర్తించారు. వెంటనే శిశువుకు చుట్టిన తెల్లగుడ్డ తీసి చూడగా తలకు కత్తిగాటు కనిపించింది. వెంటనే రవికుమార్‌ కుటుంబసభ్యులు, బంధువులు శిశువుని తీసుకుని దర్గామిట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతిచెందిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి జీజీహెచ్‌కి వెళ్లి వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేయడంతో శిశువు చనిపోయిందని ఆందోళనకు దిగారు. సదరు డాక్టర్లను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రసూతి విభాగం వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. విచారణ జరిపిస్తామని తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.   

విచారణ కమిటీ వేశాం
శిశువు మృతి ఘటనపై కలెక్టర్, డీఎంఈకి నివేదిక పంపించాం. విచారణ కమిటీ నియమించడం జరిగింది. రెండురోజుల్లో విచారణ నివేదికను తనకు అందజేయాలని ఆదేశించా. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం.  – డాక్టర్‌ శ్రీనివాసరావు,సూపరింటెండెంట్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top