కోరిక తీరిస్తేనే మంచి మార్కులు

assistant Professor molested Bsc student - Sakshi

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రెండో భార్యగా ఉండొచ్చని మహిళా వార్డెన్ల ఒత్తిడి

తమిళనాడులో వ్యవసాయ కళాశాల విద్యార్థినికి లైంగిక వేధింపులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లి, తండ్రి తరువాత గౌరవప్రదమైన స్థానం పొందిన గురువే కామంతో విద్యార్థినిని కాటేసేందుకు పూనుకుంటే, అతని దుష్టచేష్టలకు మహిళా వార్డెన్లు వత్తాసు పలికారు. తమిళనాడులో మరో దుశ్శాసన ప్రొఫెసర్‌ ఉదంతం బయటపడింది. బాధిత విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్‌కు, తిరువణ్ణామలై జిల్లా న్యాయమూర్తికి ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మూలం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చెన్నై పెరుంగుడికి చెందిన 22 ఏళ్ల యువతి తిరువణ్ణామలై జిల్లా తండరాంపట్టు సమీపం వాళవచ్చనూరు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. ఇదే కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మదురైకి చెందిన తంగపాండియన్‌ (40) రాత్రివేళల్లో హాస్టల్‌కు వెళ్లి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.

వేధింపులు భరించలేక అదే హాస్టల్‌లోని ఇద్దరు మహిళా వార్డన్లకు బాధితురాలు తన గోడు చెప్పుకుంది. దీంతో వారు ఆమెకు అండగా నిలువకపోగా.. సదరు ప్రొఫెసర్‌ చెప్పినట్లు నడుచుకుంటే ఎంతో గొప్పదానివి అవుతావని.. అతడికి మద్దతుగా వార్డన్లు కూడా ఒత్తిడి చేయసాగారు. దీంతో ఓపిక నశించిన విద్యార్థిని చెన్నైలోని తల్లిదండ్రులకు చెప్పి విలపించింది. విద్యార్థిని తండ్రి వాళవచ్చనూరు గ్రామస్తులు, సీపీఐ నేతలతో కలిసి మంగళవారం కళాశాలను ముట్టడించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మహిళా వార్డన్లు సెల్‌ఫోన్‌ ద్వారా తనతో జరిపిన సంభాషణను బాధిత విద్యార్థిని రికార్డు చేసి తండ్రి ద్వారా ప్రిన్సిపాల్‌కు అప్పగించింది. తన కోర్కె తీరిస్తే ఎక్కువ మార్కులు వచ్చేందుకు సహకరిస్తానని ఆశపెట్టడం, మహిళా వార్డన్లు సైతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చెప్పినట్లు నడుచుకో, మంచి మార్కులతో పాసై ఇదే కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరవచ్చు.. అతడికి రెండో భార్యగా ఉంటూ జీవితంలో సెటిల్‌ కావచ్చని విద్యార్థినితో అన్న మాటలు నమోదయ్యాయి. గ్రామస్తుల ఆందోళనతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, ఇద్దరు మహిళా వార్డన్లపై ప్రిన్సిపాల్‌ విచారణ చేపట్టారు.

వాంగ్మూలం ఇచ్చిన విద్యార్థిని
తిరువణ్ణామలై డీఎస్పీ పళని కళాశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్‌ కందస్వామి కళాశాల ప్రిన్సిపాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత విద్యార్థిని బుధవారం తిరువణ్ణామలై జిల్లా మొదటిశ్రేణి మెజిస్ట్రేటు కోర్టుకు హాజరై న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధిత విద్యార్థిని వేరే కళాశాలకు మార్చాల్సిందిగా ఆయన ఆదేశించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top