కల్తీ మద్యం తయారీ గుట్టురట్టు

Adulterated Alcohol Gang Arrested in Ongole - Sakshi

హైదరాబాద్‌ నుంచి ఎన్‌డీపీ సరుకు తెప్పించి మరీ అక్రమం

మిక్సింగ్‌ సరుకును కందుకూరు, సింగరాయకొండ ప్రాంతాలకు తరలింపు

ఆయా ప్రాంతాల నుంచిబెల్ట్‌షాపులకు కల్తీ మద్యంబాటిళ్ల సరఫరా

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు నిఘా ఉంచిన ఎక్సైజ్‌ పోలీసులు

ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించినమరో ఇద్దరి అరెస్టు

కల్తీ మద్యం బాటిళ్లతో పాటు16 వేల మూతలు, వాటినిబిగించే మెషీన్‌ సీజ్‌

ఒంగోలు:కల్తీ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్‌ పోలీసులు ఉచ్చుబిగించారు. వారు బిగించిన ఉచ్చులో మద్యం అక్రమ తయారీదారుడి వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అంతే కాకుండా వారి వద్ద పెద్ద ఎత్తున కల్తీ మద్యం బాటిళ్లు సీజ్‌ చేశారు.

గుట్టు రట్టు ఇలా..
ఎక్సైజ్‌ అధికారులు సాధారణ పౌరుల్లా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్‌ సమీపంలోని షాపు నంబర్‌ 08092కు వెళ్లారు. అక్కడ మద్యం «విక్రయాలకు సంబంధించి ప్రతి బాటిల్‌పై రూ.10లు అదనంగా వసూలు చేస్తున్నట్లు స్పష్టమైంది. అంతే కాకుండా ఓ వ్యక్తికి కేస్‌ మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. షాపులో అదనపు ధరలు వసూలు చేస్తున్న సూపర్‌వైజర్‌ సుబ్రహ్మణ్యాన్ని ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు మద్యం ఎవరికి విక్రయించావని ప్రశ్నించడంతో మంగమూరు రోడ్డులోని సుంకర హరిబాబు అనే వ్యక్తికి విక్రయించినట్లు అతడు చెప్పాడు. అతడి ఇంటిపై కూడా ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేశారు.  

నకిలీ మద్యం బాటిళ్ల స్వాధీనం
పోలీసులు మంగమూరు రోడ్డులోని హరిబాబు ఇంటిపై దాడి చేశారు. అందులో 180 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉన్న హెచ్‌డీ విస్కీ బాటిళ్లు 80, మ్యాన్షన్‌ హౌస్‌ 5 లీటర్లు, అరిస్ట్రోకాట్‌ విస్కీ 9 లీటర్లతో పాటు 55 మెక్‌డొవెల్‌ మద్యం ఖాళీ సీసాలు సీజ్‌ చేశారు. వాటితో పాటు 16 వేల మెక్‌డొవెల్‌ బాటిళ్లకు సంబంధించిన సీసా మూతలు కూడా గుర్తించారు. వాటిని, మూతలను సీసాలకు బగించే మెషీన్‌ను కూడా సీజ్‌ చేశారు. ఈ క్రమంలో నిందితుడిని విచారించగా రోజూ 08092 నంబర్‌ షాపు నుంచి కేసు మద్యం కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించాడు. స్థానిక కర్నూల్‌ రోడ్డులో ఉన్న ఒక మద్యం దుకాణం నుంచి ఖాళీ మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి వాటిలో చీప్‌క్వాలిటీ మద్యం, మెక్‌డొవెల్‌ మద్యం, కొంత నీరు కలిపి కల్తీ చేసి కందుకూరు, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లోని బెల్ట్‌షాపులకు పంపుతున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల విచారణలో వెల్లడైంది. ఖాళీ మద్యం సీసా బాటిళ్లను విక్రయించి అక్రమ మద్యం వ్యాపారికి సహకరించినందుకు కర్నూల్‌ రోడ్డులోని షాపులో పనిచేస్తున్న సేల్స్‌మన్‌ వెంకట ప్రసాద్‌ను కూడా అరెస్టు చేశారు. ఇలా కల్తీ చేసిన మద్యాన్ని డిమాండ్‌ ఆధారంగా అదనపు రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో బహిర్గతమైంది. 

16 వేల మూతలు ఎలా వచ్చినట్లు?
ఇదిలా ఉంటే ఒక బ్రాండెడ్‌ కంపెనీకి సంబంధించిన మద్యం సీసా మూతలు 16 వేలు హరిబాబు వద్ద లభించడంపై ఎక్సైజ్‌ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఒక బ్రాండెడ్‌ కంపెనీకి సంబంధించిన మూతలు బయటకు రావడం దాదాపు అసాధ్యం. అటువంటిది సంబంధిత ప్రముఖ కంపెనీ మూతలు అతని వద్దకు ఎలా వచ్చాయని విచారిస్తే తనకు బార్‌ షాపులో ఒక వ్యక్తి పరిచయమయ్యాడని, అతని ద్వారా లభించాయని, అతను ఎవరో తనకు తెలియదంటూ పొంతనలేని సమాధానం నిందితుడు హరిబాబు చెబుతుండటం గమనార్హం.

అక్రమాలకు పాల్పడితే చర్యలు
నకిలీ మద్యం వ్యవహారం గుట్టు రట్టు చేసిన అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు నాయుడు మీడియాతో మాట్లాడారు. మద్యం అక్రమంగా తయారు చేసినా.. విక్రయించినా.. లేక మద్యం షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయించినా క్రిమినల్‌ కేసులు తప్పవని హెచ్చరించారు. మద్యం మూతల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ కరీనాబేగం, సిబ్బంది లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, హరినారాయణ, నిరంజన్‌రెడ్డి, అమర్‌ పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top