ఏసీబీ వలలో ఇద్దరు లంచావతారులు

ACB Attacks On DMHO Officials In PSR Nellore - Sakshi

నెల్లూరు డీఎంహెచ్‌ఓ  కార్యాలయ ఎస్టాబ్లిష్‌మెంట్‌  విభాగ సూపరింటెండెంట్,  సీనియర్‌ అసిస్టెంట్‌ అరెస్ట్‌

రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం

నెల్లూరు(క్రైమ్‌): రెండేళ్ల ప్రొబేషనరీ కాలం అనంతరం సర్వీసు రెగ్యులరైజ్‌ చేసేందుకు క్లారిఫికేషన్‌ ఉన్నతాధికారులకు పంపడానికి జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు నెల్లూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయ ఎస్టాబ్లిష్‌మింట్‌ విభాగ ఉద్యోగులను ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొన్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన కె.వెంకట మహేష్‌బాబు తండ్రి జిల్లా వైద్యారోగ్యశాఖలో వాహన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ 2009లో మృతి చెందారు. తండ్రి మరణించే నాటికి మహేష్‌ మైనర్‌ కావడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందలేకపోయాడు.  మైనార్టీ తీరిన తర్వాత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ట్రిబ్యునల్‌ 2013లో మహేష్‌బాబుకు జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా అందుకు సమాన ఉద్యోగం ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. మహేష్‌ కారుణ్య నియామకం కింద నెల్లూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో 2014 డిసెంబర్‌ 26వ తేదీన అకౌంట్స్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. 2016 డిసెంబర్‌లో ఆయన ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తయింది.

సర్వీసు రెగ్యులర్‌ అయితే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. దీంతో సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని మహేష్‌ డీఎంహెచ్‌ఓను కోరారు. రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించి  క్లారిఫికేషన్‌ను పంపాలని కార్యాలయ ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగ సూపరింటెండెంట్‌ పయ్యావుల శ్రీనివాసులను డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. మహేష్‌ సూపరింటెండెంట్‌ను కలిసి అందుకు సంబంధించిన వివరాలన్నింటిని అందజేశారు. రోజులు గడుస్తున్నా సూపరింటెండెంట్‌ రెగ్యులరైజేషన్‌కు సంబంధించి పట్టించుకోకపోగా అందుకు సంబం ధించిన పత్రాలు కనిపించడం లేదనీ మరోమారు పత్రాలను ఇవ్వాలని సూచించాడు. దీంతో మహేష్‌ తిరిగి పత్రాలన్నింటిని అందజేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల  మహేష్‌ ఏడాదిన్నర గడుస్తున్నా ఇంత వరకూ ఎందుకు క్లారిఫికేషన్‌ పంపరని సూపరింటెండెంట్‌ను నిలదీశారు. దీంతో సూపరింటెండెంట్‌ రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అయితే రూ 25 వేలు ఇస్తానని మహేష్‌ అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని మహేష్‌ రెండు రోజుల కిందట ఏసీబీ డీఎస్పీ పి. పరమేశ్వర్‌రెడ్డికి సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మహేష్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులను కలిసి లంచంగా రూ. 25 వేలు ఇవ్వబోగా  శ్రీనివాసులు ఆ నగదును సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌కు ఇవ్వాలని సూచించాడు. సీనియర్‌ అసిస్టెంట్‌కు నగదు ఇవ్వగా అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి గోపాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. శ్రీని వాసులు, గోపాల్‌ను అదుపులోకి తీసుకుని వారికి రసాయన పరీక్షలు నిర్వహించారు. లంచం తాలు కు నగదును స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం  స్టోన్‌హౌస్‌పేటలోని శ్రీనివాసులు ఇంట్లో, డీఎం హెచ్‌ఓ కార్యాలయ సమీపంలోని గోపాల్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.  ఇది ఇలా ఉంటే శ్రీనివాసులుపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలపై ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు.  ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు శివకుమార్‌రెడ్డి, దిలీప్‌లు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top