ఆయన సంపాదనకు ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు

ACB Attacks At Anantapur Rural Sub Registrars Office - Sakshi

అనంతపురం రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు 

రూ. 2.15 లక్షలు స్వాదీనం

సత్యనారాయణమూర్తి సంపాదన చూసి నోరెళ్లబెట్టిన అధికారులు

లక్షణమైన ఉద్యోగం..అయినా లంచానికి అలవాటుపడ్డాడు. జలగలా ప్రజలను పీల్చేస్తూ రోజూ రూ.లక్షల్లో సంపాదించడం అలవాటు చేసుకున్నాడు. ఆయన అవినీతి పర్వం తారస్థాయికి చేరుకోగా.. ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా కార్యాలయంలో సోదాలు చేసి రూ.2.15 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఒక్కరోజే అంతమొత్తం అనధికారికంగా లభించడంతో ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు.  

అనంతపురం సెంట్రల్‌: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోకి ప్రవేశించగానే ఏసీబీ అధికారులు తలుపులు మూసేశారు. కార్యాలయంలో ఉన్న సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లు...చివరకు సబ్‌రిజిస్ట్రార్‌ సత్యనారాయణమూర్తిని కూడా సోదా చేశారు. కార్యాలయంలోని గదులున్నీ తనిఖీ చేశారు. అంతా కలిపి రూ. 2.15 లక్షల అనధికార నగదును స్వాదీనం చేసుకున్నారు. ఒకరోజే ఏకంగా రూ. 2.15 లక్షలు అనధికార నగదు లభించడంతో ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు. ఇక సబ్‌రిజిస్ట్రార్‌ నెల సంపాదనం ఎంత ఉంటుందోనని అంచనాకు వచ్చారు.
 
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం
ఫిర్యాదుల వెల్లువ 
అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కొంతకాలంగా ఏసీబీ అధికారుల టోల్‌ఫ్రీ నంబర్‌ 14400కు ఫిర్యాదులు వెల్లాయి. దీంతో స్పందించిన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం సదరు కార్యాలయంపై మెరుపుదాడులు నిర్వహించారు. ఏసీబీ సీఐలు ప్రభాకర్, చక్రవర్తి, సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయం మొత్తం క్షుణంగా తనిఖీ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సత్యనారాయణ, అతని బినామీగా ఉన్న ప్రైవేటు వ్యక్తి ఇమ్రాన్, మధ్యవర్తిత్వం వహిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లు పీఎన్‌మూర్తి, నూర్‌మహ్మద్, ప్రభాకర్‌స్వామి, మురళీలను అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: 'చిన్నబాబుకు నమ్మకస్తుడిగా కోట్లకు పడగలు'

 
డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్‌! 
భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. సబ్‌ రిజిస్ట్రార్‌ సత్యనారాయణ మూర్తి, అతని బినామీ, మధ్యవర్తిత్వం వహిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్లు ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అందువల్లే ఒక్కరోజే రూ. 2.15 లక్షలు అనధికార నగదు దొరికినట్లు వారు భావిస్తున్నారు. అనంతరం ఏసీబీ సీఐ ప్రభాకర్‌ మాట్లాడుతూ... అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సత్యనారాయణమూర్తి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద, సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద రూ.2.15 లక్షల నగదు దొరికిందన్నారు.  నగదును స్వాదీనం చేసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top