
పకడ్వా వివాహ్‌లో భాగంగా ఎత్తుకొచ్చిన అబ్బాయిని కుర్చీకి కట్టేసిన వధువు తరఫు వ్యక్తులు
పాట్నా, బిహార్ : బలవంతపు పెళ్లిళ్లు బిహార్ రాష్ట్రంలో తారాస్థాయికి చేరాయి. అబ్బాయిని అపహరించి, తలకు గన్ను గురిపెట్టి బలవంతంగా ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టించిన 3,400 సంఘటనలు 2017లో జరిగాయి. వరుడికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇలా బలవంతంగా వివాహం జరిపే పద్దతిని బిహార్‌లో ‘పకడ్వా వివాహ్’ అని పిలుస్తారు.
వినడానికి ఈ పద్దతి ఆశ్చర్యంగా అనిపించినా.. బలవంతపు పెళ్లి సందర్భంగా నాకు ఈ పెళ్లి వద్దూ అంటూ అబ్బాయిలు కిందపడి ఏడ్చేసిన సందర్భాలు కోకొల్లలు. తలకు తుపాకీ గురిపెట్టి, లేదా కుటుంబ సభ్యులకు హాని తలపెడతామని బెదిరించి 3,400 యువకులకు 2017లో పెళ్లి తంతు జరిపించినట్లు బిహార్ పోలీసులు తెలిపారు.
వచ్చే పెళ్లిళ్ల సీజన్‌లో ‘పకడ్వా వివాహ్’లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు సూచించాం’ అని పోలీసు శాఖా ఉన్నతాధికారులు చెప్పారు. బిహార్ రాష్ట్రంలో రోజుకు సగటున తొమ్మిది బలవంతపు వివాహాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2015 లెక్కల ప్రకారం 18 ఏళ్లకుపైగా వయసున్న అబ్బాయిలను అపహరించడంలో దేశంలోనే బిహార్ మొదటి స్థానంలో ఉంది.
పకడ్వా వివాహ్ బిహార్‌లో ఓ సామాజిక సమస్య అని, వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లికుమార్తె తరఫు వారు ఈ పద్ధతిని పాటిస్తున్నారని సామాజిక వేత్త మహేంద్ర యాదవ్ చెప్పారు.