Pakadua Vivah
-
వరుడిని ఎత్తుకొచ్చి తంతు; ఆ పెళ్లి చెల్లదు!
పట్నా : వరుడిని బెదిరించి వధువు తరఫు బంధువులు చేసిన బలవంతపు పెళ్లి చెల్లదని బిహార్ కోర్టు తీర్పునిచ్చింది. ఏడాదిన్నర క్రితం వినోద్ కుమార్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి బలవంతంగా తన చెల్లెలితో వివాహం జరిపించిన విషయం తెలిసిందే. అమ్మాయి తరఫు బంధువుల దౌర్జన్యం నడుమ జరిగిన ఈ పెళ్లిలో వినోద్ ఏడుస్తూనే ఉన్నాడు. బిహార్‌లో పకాడ్వా వివాహ్‌గా వ్యవహరించే ఈ పెళ్లికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వినోద్‌కు కోర్టులో ఊరట లభించింది. ప్లాన్ ప్రకారం ఎత్తుకెళ్లి... వినోద్ కుమార్ బొకార్ స్టీల్ ప్లాంటులో జూనియర్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో 2017 డిసెంబరులో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో తనను డ్రాప్ చేస్తానని చెప్పి సురేందర్ యాదవ్ అనే వ్యక్తి వినోద్‌ను ఎత్తుకెళ్లాడు. తన చెల్లెలిని పెళ్లి చేసుకోవాలని తలకు తుపాకీ గురిపెట్టి మండపానికి లాక్కెళ్లాడు. వధువు బంధువులంతా కలిసి అతడిని చితక్కొట్టారు. దీంతో తనను విడిచిపెట్టాలంటూ వినోద్ ఎంతగా ప్రాధేయపడినా అతడు కనికరించలేదు. అతడు బోరున విలపిస్తున్నా పట్టించుకోకుండా పెళ్లి తంతు పూర్తి చేయించాడు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయం గురించి వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం బలవంతపు పెళ్లిని రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం అతడికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. కాగా బిహార్‌లో ఇటువంటి పెళ్లిళ్లు సాధరణమే. అయితే గత కొంతకాలంగా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో పకాడ్వా వివాహాలు కాస్త తగ్గుముఖం పట్టాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక తన పెళ్లి విషయమై వధువు కుటుంబ సభ్యులు అప్పీలుకు వెళ్లినా తన చివరి శ్వాస దాకా అందుకు వ్యతిరేకంగా పోరాడతానని 30 ఏళ్ల వినోద్ కుమార్ చెప్పుకొచ్చాడు. -
3,400 మందిని ఎత్తుకెళ్లి పెళ్లి చేశారు
పాట్నా, బిహార్ : బలవంతపు పెళ్లిళ్లు బిహార్ రాష్ట్రంలో తారాస్థాయికి చేరాయి. అబ్బాయిని అపహరించి, తలకు గన్ను గురిపెట్టి బలవంతంగా ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టించిన 3,400 సంఘటనలు 2017లో జరిగాయి. వరుడికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇలా బలవంతంగా వివాహం జరిపే పద్దతిని బిహార్‌లో ‘పకడ్వా వివాహ్’ అని పిలుస్తారు. వినడానికి ఈ పద్దతి ఆశ్చర్యంగా అనిపించినా.. బలవంతపు పెళ్లి సందర్భంగా నాకు ఈ పెళ్లి వద్దూ అంటూ అబ్బాయిలు కిందపడి ఏడ్చేసిన సందర్భాలు కోకొల్లలు. తలకు తుపాకీ గురిపెట్టి, లేదా కుటుంబ సభ్యులకు హాని తలపెడతామని బెదిరించి 3,400 యువకులకు 2017లో పెళ్లి తంతు జరిపించినట్లు బిహార్ పోలీసులు తెలిపారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్లో ‘పకడ్వా వివాహ్’లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు సూచించాం’ అని పోలీసు శాఖా ఉన్నతాధికారులు చెప్పారు. బిహార్ రాష్ట్రంలో రోజుకు సగటున తొమ్మిది బలవంతపు వివాహాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2015 లెక్కల ప్రకారం 18 ఏళ్లకుపైగా వయసున్న అబ్బాయిలను అపహరించడంలో దేశంలోనే బిహార్ మొదటి స్థానంలో ఉంది. పకడ్వా వివాహ్ బిహార్‌లో ఓ సామాజిక సమస్య అని, వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లికుమార్తె తరఫు వారు ఈ పద్ధతిని పాటిస్తున్నారని సామాజిక వేత్త మహేంద్ర యాదవ్ చెప్పారు.