వృద్ధి రేటు అంచనాను తగ్గించిన వరల్డ్‌ బ్యాంక్‌

World Bank Warns Slow Down Of India Growth Rate - Sakshi

న్యూఢిల్లీ:  భారత వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంక్‌ 7.5శాతం నుంచి 6శాతానికి తగ్గించింది. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొనుందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక స్పష్టం చేసింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ క్రమక్రమంగా పుంజుకొని వృద్ధి రేటు 6.9శాతానికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.5శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్‌ గతంలో అంచనా వేసిన విషయం విదితమే. కానీ, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా వృద్ధి రేటును బ్యాంక్‌ తగ్గించిందని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి కూడా ఆశాజనకంగా లేదని తెలిపింది. 

ఇటీవల కాలంలో ప్రకటించిన పారిశ్రామిక రాయితీలతో ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు పుంజుకుంటుందో వేచిచూడాలని పేర్కొంది. గత వారం రేటింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన మూడీస్ ఇన్వెస్టర్స్ నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు అంచనాను 6.2 శాతం నుండి 5.8 శాతానికి తగ్గించింది. అయితే క్షీణించిన వృద్ధి రేటు కారణంగా  ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి ఇబ్బందులను ఎదుర్కోనుందని నివేదిక తెలిపింది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం రూ 1.5 లక్షల కోట్ల పన్ను ఆదాయాన్ని కోల్పోనుందని తెలిపింది. ప్రభుత్వం ఆర్థక వ్యవస్థ పుంజుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా క్షీణించిన వృద్ధి రేటు ఆందోళన కలిగించే అంశమని నివేదిక స్పష్టం చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top