టాటా స్టీల్‌ లాభం... రూ.1,934 కోట్లు

Tata Steel's Q1 profit doubles to ₹1934 crore - Sakshi

రెండు రెట్లకు పైగా వృద్ధి

సంతృప్తికరంగా యూరప్‌ విభాగం పనితీరు

28 శాతం పెరిగిన మొత్తం ఆదాయం   

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,934 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం, రూ.921 కోట్లతో పోలిస్తే రెండు రెట్ల వృద్ధి సాధించామని టాటా స్టీల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.29,657 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.37,833 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్‌ సీఈఓ, ఎమ్‌డీ, టి.వి.నరేంద్రన్‌ చెప్పారు. గత క్యూ1లో రూ.6,579 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ1లో రూ.6,559 కోట్లకు తగ్గిందని, అయితే ఎబిటా మార్జిన్‌ 30 బేసిస్‌ పాయింట్లు పెరిగి 17.1 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.

ఉక్కుకు డిమాండ్‌ బాగా ఉండటంతో ఈ క్యూ1లో మంచి పనితీరు సాధించామని చెప్పారు. అన్ని విభాగాలు మంచి వృద్ధిని నమోదు చేశాయని పేర్కొన్నారు. టాటా స్టీల్‌ యూరప్‌ పనితీరు కూడా బావుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారత్‌లో ఉక్కుకు డిమాండ్‌ పటిష్టంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అయితే, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు ప్రతికూల ప్రభావం చూపించవచ్చని పేర్కొన్నారు. ఈ కంపెనీ రూ.35,856 కోట్ల ఆదాయంపై రూ.2,587 కోట్ల నికర లాభం, రూ.6,830 కోట్ల ఎబిటా, 19 శాతం ఎబిటా మార్జిన్‌  సాధిస్తుందని  విశ్లేషకులు అంచనా వేశారు.  

స్టాండలోన్‌ లాభం 358% అప్‌...: స్టాండలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం 358 శాతం వృద్ధితో రూ.2,318 కోట్లకు, ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.16,406 కోట్లకు పెరిగాయని నరేంద్రన్‌ తెలిపారు. ఎబిటా 76 శాతం పెరిగి రూ.5,118 కోట్లకు పెరిగిందని, మార్జిన్‌ 8.8 శాతం పెరిగి 31.2 శాతానికి చేరిందని తెలిపారు. ఎబిటా (భారత్‌) టన్నుకు రూ.17,252కు వృద్ధి చెందిందని తెలిపారు. టాటా స్టీల్‌ దేశీయ ఆదాయం 14% వృద్ధితో రూ.16,405 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. టాటా స్టీల్‌ యూరప్‌ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.16,429 కోట్లకు పెరిగిందని, ఎబిటా 33 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లకు చేరిందని తెలిపారు. వ్యయాలు రూ.28,844 కోట్ల నుంచి రూ.34,041 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.

పుష్కలంగా నగదు నిల్వలు...
కంపెనీ వద్ద నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని నరేంద్రన్‌ తెలిపారు. రూ.13,086  కోట్ల నగదు, నగదు సమాన నిల్వలున్నాయని, బ్యాంక్‌ ఖాతాల్లో రూ.11,899 కోట్లు ఉన్నాయని మొత్తం మీద రూ.24,984 కోట్ల నగదు నిల్వలున్నాయని తెలిపారు. ఈ జూన్‌ క్వార్టర్‌లో రూ.1,931 కోట్ల మేర మూలధన పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో టాటా స్టీల్‌ షేర్‌ 1.1 శాతం నష్టంతో రూ.569 వద్ద ముగిసింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top