
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.1,018 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.3,116 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్ తెలిపింది. ఇక ఆదాయం రూ.32,676 కోట్ల నుంచి రూ.43,899 కోట్లకు ఎగసిందని టాటా స్టీల్ సీఈఓ, ఎమ్‌డీ టీవీ నరేంద్రన్ తెలిపారు. గత క్యూ2లో రూ.4,720 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో 89 శాతం పెరిగి రూ.8,920 కోట్లకు పెరిగిందని తెలిపారు.
నిర్వహణ మార్జిన్ 14.5 శాతం నుంచి 20.5 శాతానికి ఎగసిందని వివరించారు. ఒక్కో టన్నుకు ఎబిటా రూ.19,244గా ఉందని వివరించారు. భారత కార్యకలాపాలకు సంబంధించి ఈ క్వార్టర్‌లో అత్యుత్తమమైన ఎబిటా మార్జిన్‌ను సాధించామని, ఆరేళ్లలో ఇదే అత్యధిక త్రైమాసిక ఎబిటా అని వివరించారు. భూషణ్ స్టీల్ టేకోవర్ కలసివచ్చిందని, మార్జిన్లు మెరుగుపడ్డాయని, ఫలితంగా పనితీరు కూడా మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. ఈ క్యూ2లోనే ఉషా మార్జిన్ కంపెనీని రూ.4,700 కోట్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు.
పటిష్టంగా ఆర్థిక ఫలితాలు....
టాటా స్టీల్ గ్రూప్ వద్ద రూ.14,478 కోట్ల నగదు, నగదుకు సమానమైన నిల్వలున్నాయని, మొత్తం నిధులు రూ.26,470 కోట్లుగా ఉన్నాయని నరేంద్రన్ వివరించారు. స్థూల రుణభారం రూ.2,065 కోట్లు పెరిగిందని, నికర రుణభారం రూ.1,04,202 కోట్లుగా ఉందని తెలిపారు. ఈ క్యూ2లో పటిష్టమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించామని భారత్‌లో వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉండటం, నిర్వహణ పనితీరు జోరుగా ఉండటం దీనికి ప్రధాన కారణాలని వివరించారు.
సీజనల్‌గా ఈ క్యూ2 బలహీనమైనదని, అయినప్పటికీ, టాటా స్టీల్(స్టాండ్ అలోన్), భూషణ్ స్టీల్‌లు 4.32 మిలియన్ టన్నుల స్టీల్‌ను విక్రయించాయని వివరించారు. భారత సంస్థల జోరును పెంచే వ్యూహాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఉషా మార్టిన్ కంపెనీకి చెందిన ఒక మిలియన్ టన్ను వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ను కొనుగోలు చేశామని వివరించారు. అంతర్జాతీయంగా చూస్తే, టీఎస్‌ఈ థిసన్‌క్రప్ జాయింట్ వెంచర్ విషయంలో మంచి పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు.
రెండో దశ సమీక్ష విషయమై యూరోపియన్ కమిషన్‌తో చర్చలు జరుపుతున్నామని, దీనికి 90 రోజులు పడుతుందని వివరించారు. ఉక్కు డిమాండ్ సానుకూలంగానే ఉండొచ్చని, అయితే వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న దిగుమతులు ప్రతికూల ప్రభావం చూపించనున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ భారత్‌లో అడుగిడటం మన దేశ ఉక్కు రంగానికి ప్రయోజనకరమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఇప్పటికే యూరప్‌లో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీతో పోటీపడుతున్నామని, భారత్‌లో తమకు ఇది సమస్య కాదని పేర్కొన్నారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ కంపెనీ షేర్ 1 శాతం లాభంతో రూ.589 వద్ద ముగిసింది.