మీ ఆస్తులు అమ్మకండి..! | Supreme Court directive to JP Associates promoters and directors | Sakshi
Sakshi News home page

మీ ఆస్తులు అమ్మకండి..!

Nov 23 2017 12:24 AM | Updated on Sep 2 2018 5:24 PM

Supreme Court directive to JP Associates promoters and directors - Sakshi

న్యూఢిల్లీ:  జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ – గృహ కొనుగోలుదారుల కేసులో మాతృసంస్థ– జైప్రకాశ్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌ (జేఏఎల్‌)కు బుధవారం సుప్రీంకోర్టు  కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన ఐదుగురు ప్రమోటర్లుసహా 13 మంది డైరెక్టర్లు తమ వ్యక్తిగత ఆస్తులు అమ్మకూడదని నిర్దేశించింది. వ్యక్తిగత లేదా సన్నిహిత కుటుంబ సభ్యులు, లేదా డిపెండెంట్‌ సభ్యుల ఆస్తులు విక్రయిస్తే కోర్టు ధిక్కారంసహా క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌నూ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. అనుబంధ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించి బకాయిల మొత్తాన్ని గృహ కొనుగోలుదారులకు చెల్లించాల్సిందేనని మాతృసంస్థ– జేపీ అసోసియేట్స్‌కు స్పష్టంచేసిన సుప్రీంకోర్టు అప్పటి వరకూ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అమ్మకాలపై నిషేధం ఉంటుందని పేర్కొంది.  
రూ.275 కోట్ల డిపాజిట్‌కు నిర్దేశం.
..
దీనితోపాటు డిసెంబర్‌ 14వ తేదీలోగా రూ.150 కోట్లు, డిసెంబర్‌ 31వ తేదీలోపు రూ.125 కోట్లు మొత్తం రూ.275 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. బకాయిలకు సంబంధించి రియల్టీ సంస్థ బుధవారం సమర్పించిన రూ.275 కోట్లు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను కూడా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖాన్వేరర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆమోదించింది. కేసు తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు డైరెక్టర్లు అందరూ కోర్టుకు హాజరుకావాలని నిర్దేశించింది.  దివాలా న్యాయసంబంధ సమస్యలను ఎదుర్కొంటున్న జేపీ ఇన్‌ఫ్రాటెక్, నోయిడాలోని వివిధ ప్రాజెక్టులకు గాను గృహ కొనుగోలుదారులకు దాదాపు రూ.2,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ కేసులో నాన్‌–ఇన్‌స్టిట్యూషనల్‌ డైరెక్టర్లు అందరూ తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను అందజేయాలని నవంబర్‌ 13న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తన అనుమతి లేకుండా విదేశీ ప్రయాణాలు చేయరాదని జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ, డైరెక్టర్లకు అంతక్రితమే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
 
ఆభరణాలు అమ్మి అయినా...
‘‘మంచి పిల్లల తరహాలో ఇవ్వాల్సింది ఇచ్చేయండి. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుక్కోడానికి జీవితకాలం దాచుకున్న పొదుపులను పాడుచేయకూడదు. మీ కుటుంబ ఆభరణాలను తనఖా పెట్టండి. లేదా అమ్మేయండి. మధ్య తరగతి నుంచి వసూలు చేసిన సొమ్ము వారికి అందాల్సిందే.’’ అని మాతృ సంస్థ డైరెక్టర్లను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసులో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తన వాదనలు వినిపిస్తూ, జేపీ నిధులను మళ్లించిందని అన్నారు. సంస్థ వ్యవహారాల విచారణకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అవసరమని వివరించారు. నష్టపోయిన వారి వివరాలతో వారం లోపు ఒక వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేసులో న్యాయ సహాయకునిగా ఉన్న న్యాయవాది పవన్‌ శ్రీ అగర్వాల్‌కు సుప్రీంకోర్టు సూచించింది. దాదాపు 32,000 మంది జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రాజెక్టుల్లో తమ ఫ్లాట్స్‌ బుక్‌చేసుకుని, ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లిస్తున్నారని చిత్రా శర్మా అనే వ్యక్తి సహా పలువురు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌)లో కంపెనీపై జరుగుతున్న దివాలా ప్రొసీడింగ్స్‌పై సెప్టెంబర్‌ 4న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రూ.526 కోట్ల బకాయిలకు సంబంధించి ఐడీబీఐ బ్యాంక్‌  దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఆగస్టు 10న ఎన్‌సీఎల్‌టీ అడ్మిట్‌ చేసింది. ఆ వెంటనే ‘ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి’ అంటూ వందలాది మంది జేపీ ఇన్‌ఫ్రాటెక్‌  హోమ్‌ బయ్యర్లు ఆందోళన బాట పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement