స్టాక్స్‌ వ్యూ

Stocks view - Sakshi

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఆనంద్‌రాఠి సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.1,923     టార్గెట్‌ ధర: రూ.2,248
ఎందుకంటే:
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ నాణ్యత మెరుగుపడింది. తాజా మొండి బకాయిలు 1 శాతం తగ్గాయి. రుణ వ్యయాలు కూడా తగ్గాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత మరింతగా మెరుగుపడుతుందని భావిస్తున్నాం. కార్పొరేట్‌ రుణాలు 30 శాతం, వాహన, రిటైల్‌ రుణాలు 28 శాతం చొప్పున వృద్ధి చెందడంతో మొత్తం రుణ వృద్ధి 29 శాతానికి పెరిగింది. మధ్య కాలానికి బ్యాక్‌ రుణ వృద్ధి 26 శాతం రేంజ్‌లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.

2008–18 కాలానికి ఇతర(వడ్డీయేతర) ఆదాయం 32 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందింది. మొత్తం ఆదాయంలో ఇతర ఆదాయం 28 శాతంగాఉంది. ఈ క్యూ1లో ట్రేడింగ్‌ ఆదాయం 29 శాతం తగ్గినా, ఇతర ఆదాయం 12 శాతం పెరిగింది.  ప్రస్తుతం 60:40గా ఉన్న కార్పొరేట్, రిటైల్‌ రుణ నిష్పత్తిని 50:50 శాతంగా రీబ్యాలన్స్‌ చేయాలని,  రిటైల్‌ రుణాలపై మరింతగా దృష్టి పెట్టాలని బ్యాంక్‌ యోచిస్తోంది. ఫలితంగా భవిష్యత్తులో మంచి వృద్ధి అవకాశాలున్నాయి. ఈ క్యూ1లో నికర వడ్డీ మార్జిన్‌ 3.92 శాతంగా నమోదైంది.

రిటైల్‌ రుణాలు పెరుగుతుండటం, కాసా నిష్పత్తి (43.4 శాతంగా)పటిష్టంగా ఉండటంతో నికర వడ్డీ మార్జిన్‌ ఈ స్థాయి కంటే తగ్గకపోవచ్చు. కాసా నిష్పత్తి పటిష్టంగా ఉండటంతో రుణ వ్యయాలు తగ్గవచ్చు. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్‌ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌ విలీనం సానుకూలాంశమే. కార్పొరేట్‌ రుణాల్లో తాజా మొండి బకాయిలు పెరిగే అవకాశాలు, భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ విలీనాంతరం సూక్ష్మ రుణ విభాగం నుంచి ఎదురయ్యే సమస్యల కారణంగా రుణ నాణ్యత తగ్గే అవకాశాలు... ఈ రెండు అంశాలు ప్రతికూలాంశాలు.  

గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌  
ప్రస్తుత ధర: రూ.1,313     టార్గెట్‌ ధర: రూ.1,435
ఎందుకంటే:
టాయ్‌లెట్‌ సోప్, హౌస్‌హోల్డ్‌ ఇన్‌సెక్టిసైడ్స్, హెయిర్‌ కలర్‌ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెద్ద కంపెనీల్లో ఒకటి. హెయిర్‌ కలర్‌ సెగ్మెంట్లో అగ్రస్థానం ఈ కంపెనీదే. వివిధ రేంజ్‌ ధరల్లో విస్తృతమైన ఉత్పత్తులనందిస్తోంది. సబ్బుల మార్కెట్లో హిందుస్తాన్‌ యూనీలివర్‌ తర్వాతి స్థానం ఈ కంపెనీదే. గోద్రేజ్‌ నంబర్‌ 1, సింథాల్, ఫెయిర్‌ గ్లో వంటి బ్రాండ్‌లతో  10–12 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీ సాధించింది. హౌస్‌హోల్డ్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ సెగ్మెంట్లో మూడు కేటగిరీల్లోనూ ఈ కంపెనీదే అగ్రస్థానం. అంతర్జాతీయ మార్కెట్లోకి విస్తరణలో భాగంగా వివిధ దేశాల్లో వివిధ కంపెనీలను కొనుగోలు చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి జోరు కొనసాగుతుందని కంపెనీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నది. కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన పవర్‌ చిప్‌ మంచి అమ్మకాలు సాధిస్తుందని కంపెనీ విశ్వసిస్తోంది. అంతర్జాతీయ వ్యాపారం రికవరీ అవుతుండటంతో రాబడి నిష్పత్తుల పెంపుపై కంపెనీ దృష్టి సారిస్తోంది. గోద్రేజ్‌ నంబర్‌ 1 సోప్‌ను తూర్పు ప్రాంతంలో, సింధాల్‌ సోప్‌కు సౌత్‌ మార్కెట్లోకి మరింతగా విస్తరించడం ద్వారా మార్కెట్‌ వాటా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి క్వార్టర్‌లో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులు కలసివచ్చే అంశం. 

వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 39 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్‌ ట్రేడవుతోంది. ఏడాది కాలంలో ఈ షేర్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 45 రెట్ల ధరకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ప్రతికూలాంశాల పరంగా చూస్తే, వర్షాలు సరిగ్గా కురవకపోతే గ్రామీణ డిమాం డ్‌ తగ్గవచ్చు. రూపాయి, ఇండోనేషియా కరెన్సీ రూపయ్యా, అర్జెంటీనా పెసోలు బలహీనపడుతుండటం వల్ల లాభదాయకత తగ్గవచ్చు. ఐటీసీ, హెచ్‌యూఎల్, విప్రోల నుంచి సబ్బుల సెగ్మెంట్లో తీవ్ర పోటీ.. మార్కెట్‌ వాటాపై ప్రభావం చూపవచ్చు.

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top