స్టాక్స్‌ వ్యూ

Stocks view  - Sakshi

సన్‌ ఫార్మా - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌
ప్రస్తుత ధర: రూ.502; టార్గెట్‌ ధర: రూ.600

ఎందుకంటే: దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్‌ ఫార్మా షేర్‌ ఇటీవల బాగానే పతనమైంది. సంస్థ 52 వారాల కనిష్ట–గరిష్ట స్థాయిలు రూ.432.70–రూ.709.65. తాజాగా ఈ కంపెనీకి చెందిన హలోల్‌ ప్లాంట్‌పై మళ్లీ తనిఖీ నిర్వహించిన అమెరికా ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ) మూడు అభ్యంతరాలను వెలిబుచ్చింది. ప్లాంట్‌ పరికరాలు, ఉద్యోగుల శిక్షణ, ఇంక్యుబేషన్‌ టెంపరేచర్‌ వంటి అంశాలపై ఈ అభ్యంతరాలు... సహజమైన విషయాలే కాబట్టి, వీటిని సులభంగా పరిష్కరించవచ్చు.

2016 నాటి తనిఖీలో అమెరికా ఎఫ్‌డీఏ వ్యక్తం చేసిన తొమ్మిది పరిశీలనలతో పోల్చితే తాజా పరిశీలనలు మూడో వంతుకు తగ్గాయి. ఇది కంపెనీకి ఊరటనిచ్చే విషయం. ఈ సమస్యలు సమసిపోతే, ఈ ప్లాంట్‌ నుంచి ఈ కంపెనీ చాలా కాంప్లెక్స్‌ జనరిక్స్‌ ఔషధాలను  అమెరికా మార్కెట్లో విడుదల చేయగలుగుతుంది. అంతేకాక అమెరికా మార్కెట్లో ప్రస్తుతమున్న ఔషధాలను పునర్వ్యవస్థీకరించగలుగుతుంది.

ఈ ప్లాంట్‌కు క్లియరెన్స్‌ పొందలేకపోతే, ఔషధాల ఆమోదాల్లో జాప్యం కారణంగా  ఈ కంపెనీ చాలా మంచి అవకాశాలను కోల్పోతుంది. మరోవైపు ఇదే ప్లాంట్‌పై 2015లో జారీ అయిన వార్నింగ్‌ లెటర్‌ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయని మేం భావిస్తున్నాం.

కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: సెంట్రమ్‌
ప్రస్తుత ధర: రూ.99; టార్గెట్‌ ధర: రూ.123

ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రికవరీ కనిపించినా, మూడో క్వార్టర్లో మాత్రం ఈ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. అయితే రుణాలు 17 శాతం వృద్ధి చెందడం గమనించదగ్గ అంశం. 2015–17 క్యూ2 తర్వాత రుణ వృద్ధి ఇంత అధికంగా ఉండడం ఇదే మొదటిసారి. స్థూల మొండి బకాయిలు 1 శాతం పెరిగి 6 శాతానికి, నికర మొండి బకాయిలు 0.6 శాతం వృద్ధితో 3.88 శాతానికి పెరిగాయి.   నికర వడ్డీ ఆదాయం ఫ్లాట్‌గా 8.5 శాతంగా నమోదైంది.

ఇతర ఆదాయం 32% వృద్ధి చెందడంతో కేటాయింపులకు ముందు లాభం 28% ఎగిసింది. కేటాయింపులు పెరగడంతో నికర లాభం 38% తగ్గిపోయింది. వ్యాపారం 9% వృద్ధితో రూ.1,01,955 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 4% వృద్ధితో రూ.16,024 కోట్లకు ఎగిశాయి. మొండి బకాయిలు పెరుగుతున్నాయని,  రానున్న రెండు క్వార్టర్లూ బలహీనంగా ఉంటాయని బ్యాంక్‌ అంటోంది.  లాభదాయకత తక్కువ స్థాయిలో ఉండొచ్చు. 

భవిష్యత్తులో మొత్తం రుణాల్లో చిన్న స్థాయి రిటైల్‌ రుణాలు 70–80% మేర పెంచుకోవాలనేది బ్యాంక్‌ లక్ష్యం. ఫలితంగా రుణ డిఫాల్ట్‌లు తగ్గుతాయని, మొండి బకాయిల పరిస్థితి మెరుగుపడుతుందని బ్యాంక్‌ భావన. రెండేళ్లలో వ్యాపారం 18% చొప్పున చక్రగతి వృద్ధితో రూ.1,48,338 కోట్లకు పెరుగుతాయని  అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top