ప్లాస్టిక్‌ రహిత సంస్థగా ఎస్‌బీఐ

SBI To Become Plastic Free Organisation In One Year - Sakshi

హైదరాబాద్‌ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని, దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. ఏడాది లోపు ఎస్‌బీఐను ప్లాస్టిక్‌ రహిత సంస్థగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొంది. 2022 వరకు ప్లాస్టిక్‌ వాడకాన్ని నిర్మూలించాలని భావిస్తున్న కేంద్ర నిబద్ధతకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌కు అనుగుణంగా ఎస్‌బీఐ ఈ కీలక కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించింది.

వచ్చే 12 నెలల్లో, ఎస్‌బీఐను ప్లాస్టిక్‌ రహిత సంస్థగా మార్చేందుకు దశల వారీగా చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. తమ ఆఫీసుల్లో, మీటింగుల్లో పెట్‌ వాటర్‌ బాటిళ్లను(ప్లాస్టిక్‌ బాటిళ్లను), నీటి పంపిణీదారితో భర్తీ చేయనున్నామని చెప్పింది.  ప్లాస్టిక్‌ బాటిళ్లకు బదులు నాణ్యమైన కాగితపు ఫోల్డర్లను వాడుతామని పేర్కొంది. భోజనశాలల్లో ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ప్లేట్లకు బదులు పర్యావరణ హిత పాత్రలను వినియోగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది.  

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా ముంబైలో జరిగిన క్లీన్‌నెస్‌ డ్రైవ్‌లో చైర్మన్‌తో పాటు 300 మంది ఎస్‌బీఐ ఉద్యోగులు, బ్యాంక్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక ప్రధాన కార్యాలయాల్లో ఈ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రత్యేక సందర్భంలో ఈ కార్యక్రమాన్ని లాంచ్‌ చేయడం ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. మన దేశంలో రోజు రోజుకీ ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోందని, ఇది దేశానికి అతిపెద్ద పర్యావరణ సవాలని పేర్కొన్నారు.   


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top