పట్టణాలకు రియల్టీ పట్టం!

పట్టణాలకు రియల్టీ పట్టం!


పారిశ్రామిక హబ్‌లుగా షాద్‌నగర్, కొత్తూరు

ప్రాజెక్ట్‌లు, వెంచర్లతో స్థిరాస్తి సంస్థల పరుగులు

ఐదేళ్ల క్రితం ఎకరం రూ.10 లక్షలు.. ఇప్పుడు రూ.50 లక్షలకు పైమాటే

రాబోయే రోజుల్లో 30 శాతం వరకూ ధరలు పెరిగే అవకాశం

పెట్టుబడికి ఇదే సరైన సమయమంటున్న నిపుణులు

నీళ్లు.. ఎత్తు నుంచి పల్లానికి ఎలాగైతే ప్రవహిస్తాయో..


 అభివృద్ధి కూడా అంతే! అంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటూ స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్న ప్రాంతాల వైపే అభివృద్ధి సాగుతుందని దానర్థం. దీన్ని స్థిరాస్తి భాషలో చెప్పాలంటే మేకింగ్ ఆఫ్ షిఫ్ట్‌గా పరిగణిస్తారు. అంటే భాగ్యనగరంలో రియల్ బూమ్ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లిహిల్స్ నుంచి మాదాపూర్‌కు, ఆ తర్వాత గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌కు ఎలాగైతే పరుగులు పెట్టిందో.. ఇప్పుడు ఇదే బూమ్ షాద్‌నగర్, కొత్తూరుల వైపు మళ్లింది.


సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్, కొత్తూరు మండలాలు మహబూబ్‌నగర్ పరిధిలోకి వస్తాయి. షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ పరిధిలో ఫలూక్‌నగర్, కొత్తూరు, కొందుర్గ్, కేశంపేట ప్రాంతాలొస్తాయి. వీటిలో పారిశ్రామికంగా పేరుగాంచినవి షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాలే. 2011 లెక్కల ప్రకారం పాలమూరులో మొత్తం ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు 10,770 ఉన్నాయి. వీటిలో సుమారు 75 పరిశ్రమలు భారీ పరిశ్రమలే. వీటిల్లో సుమారు 30 వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఐదేళ్లుగా 26 కొత్త పరిశ్రమలు ఇక్కడికొచ్చాయి. వీటిలో ఫుడ్ అండ్ ఆగ్రో, పవర్, టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, ఫార్మా రంగాలకు చెందినవి ఉన్నాయి. ఇందులో చాలా వరకు పరిశ్రమలు కొత్తూరు, షాద్‌నగర్ ప్రాంతాల్లో కొలువుదీరినవే ఎక్కువ. ‘‘ఈ రెండు ప్రాంతాల్లో సుమారు లక్ష ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని.. వీటిలో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు రానున్నాయని వీటి ద్వారా సుమారు లక్ష వరకు ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయని’’ స్పేస్ విజన్ ఎడిఫైస్ ప్రై.లి. సీఎండీ టీవీ నర్సింహారెడ్డి సాక్షి రియల్టీకి చెప్పారు.


♦  హైదరాబాద్ నుంచి 48 కి.మీ., శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యం నుంచి 22 కి.మీ. దూరంలో ఉందీ షాద్‌నగర్. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలుపుకెళ్లే జాతీయ రహదారి-44  షాద్‌నగర్ మీదుగానే వెళుతుంది కూడా. నగరం చుట్టూ ఉన్న ఓఆర్‌ఆర్‌తో నగరానికి, మెట్రోతో నగరమంతా సులువుగా, సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండటంతో కార్యాలయాలకు దగ్గర్లోనే నివాసముండేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. నగరానికి దూరంగా ఉంటుండటంతో రణగొణ ధ్వనులకు, ట్రాఫిక్ సమస్యలకు దూరంగా పచ్చని ప్రకృతిలో జీవించొచ్చనేది వీరి అభిప్రాయం.


 విద్యా, వినోదం కూడా..

అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన సింబయాసిస్, టాటా వర్సిటీ వంటివి కొత్తూరులోనే ఉన్నాయి. మరో నాలుగు వేద విశ్వవిద్యాలయాలూ ఉన్నాయిక్కడ. ఈ మార్గంలో బయోకన్జర్వేషన్ జోన్ కింద 20 కి.మీ. పరిధి ఉండటంతో ఆ తర్వాత ఉన్న ప్రాంతం పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంది. భూగర్భ జల వనరులకూ కొదవేలేదిక్కడ. ఇక్కడ 650 ఎంసీఎం వరకు నీరు అందుబాటులో ఉందని ది సెంట్రల్ గ్రౌండ్ బోర్డ్ లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం బహదూర్‌పల్లిలోని జూ పార్క్.. షాద్‌నగర్ నుంచి 3 కి.మీ. దూరంలో ఉన్న కమ్మాదనం రిజర్వ్ ఫారెస్ట్‌కు తరలనుంది. ఇది 824 ఎకరాల్లో విస్తరించి ఉంది. వెజిటెబుల్ క్లస్టర్ బాల్‌నగర్, షాద్‌నగర్‌లో ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది.


ఎకరం రూ.50 లక్షల పైమాటే..

ప్రస్తుతం షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లో డీఎల్‌ఎఫ్, స్పేస్ విజన్ వంటి సంస్థలు ప్రాజెక్ట్‌లు, వెంచర్లను చేస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ధర ఎకరానికి రూ.10-15 లక్షలుండేది. కానీ, ఇప్పుడు రూ.60 లక్షల పైచిలుకు చేరింది. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళితే రూ.40 లక్షల్లోపూ దొరుకుతున్నాయి. ఇక ఫ్లాట్ల ధరలు చూస్తే.. చ.అ. ధర రూ.2,000 నుంచి ప్రారంభమవుతున్నాయని’’ నర్సింహారెడ్డి చెప్పారు. టీఎస్-ఐపాస్, ఐటీ పాలసీలతో మరిన్ని పరిశ్రమలిక్కడి రానున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఏటా 25-30 శాతం రేట్లు పెరగొచ్చని అంచనా వేశారాయన.


షాద్‌నగర్, కొత్తూరులోని కొన్ని కంపెనీలు

కొత్తూరులో ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్‌జీ) టైడ్, ఏరియల్ సబ్బుల తయారీ యూనిట్‌ను మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఇక్కడ రూ.900 కోట్లతో తమ కంపెనీని ఏర్పాటు చేసింది. విస్తరణలో భాగంగా మూడేళ్లలో సుమారు రూ.3 వేల కోట్లతో అతిపెద్ద సబ్బుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో సుమారు 2,000 మందికి ఉపాధి రానుంది.

కొత్తూరులో జాన్సన్ అండ్ జాన్సన్ సుమారు 47 ఎకరాల్లో రూ.400 కోట్లతో ఏర్పాటు చేశారు. డైపర్స్, సబ్బులు, బేబీ నూనెలు, షాంపులతో పాటు మెడికల్ ఉత్పత్తులు ఇక్కడ తయారు కానున్నాయి. అదనంగా మరో 4 వేల కోట్లతో 40 ఎకరాల్లో ప్లాంటును విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది. దీంతో అదనంగా మరో రెండు వేలమందికి ఉపాధి లభించనుంది.

నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటు ఫార్మాసిటీలో ఏర్పాటు కానుంది. సుమారు 12 వేల ఎకరాల భూమి కేటాయింపు కూడా జరిగిందని సమాచారం.

నగరంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ), అమ్యూజ్‌మెంట్ పార్క్, జూపార్క్ లు షాద్‌నగర్‌లోని బాలానగర్‌కు తరలనున్నాయి.

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్తూరులో 2.80 లక్షల చ.అ.ల్లో భారీ గిడ్డంగిని ఏర్పాటు చేసింది. సుమారు 500 మందికి ఉపాధి కల్పిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top