హైదరాబాద్‌లో ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రం | Pratt and Whitney training center in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రం

Sep 11 2015 1:07 AM | Updated on Sep 3 2017 9:08 AM

హైదరాబాద్‌లో ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రం

హైదరాబాద్‌లో ప్రాట్ అండ్ విట్నీ శిక్షణ కేంద్రం

దేశీయ విమానయాన రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అంతర్జాతీయ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ ప్రకటించింది...

అమెరికా, చైనా కేంద్రాల తర్వాత ఇది మూడోది
- ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్
- ఇండియా నుంచి 600 విమాన ఇంజిన్ల ఆర్డరు : ప్రాట్ అండ్ విట్నీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
దేశీయ విమానయాన రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అంతర్జాతీయ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 7,000 విమాన ఇంజిన్లకు ఆర్డర్లు రాగా అందులో కేవలం 600 ఇండియా నుంచే వచ్చినట్లు ప్రాట్ అండ్ విట్నీ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ ఇంజిన్స్ -ఏషియా పసిఫిక్) మేరీ ఎల్లెన్ ఎస్ జోన్స్ తెలిపారు. మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం, ఇంధన ధరలు తగ్గడంతో దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ఇండిగో, గోఎయిర్, ఎయిర్‌కోస్టా వంటి దేశీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడమే దీనికి నిదర్శనమన్నారు.

అంతకుముందు ప్రాట్ అండ్ విట్నీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వినియోగదారుల (ఇంజిన్లు ఉపయోగించే ఎయిర్‌లైన్స్ కంపెనీల సిబ్బంది) శిక్షణ కేంద్రాన్ని  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  అమెరికా, చైనా తర్వాత ఇది మూడవ కేంద్రమని, ఈ కేంద్రంలో జీటీఎఫ్, వీ2500 ఇంజిన్లపై వినియోగదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కేంద్రంలో 2,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వవచ్చని, దీన్ని త్వరలోనే 4,000 మందికి విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ సంస్థలో 1500 మంది పనిచేస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
పరిశీలన దశలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు
దేశీయ విమానయాన రంగాన్ని ప్రోత్సహించే విధంగా కొత్త విమానయాన విధానం ఉంటుందని అశోక్ గజపతి రాజు తెలిపారు. ఇప్పటికే ఉన్న సంస్థలతో పాటు కొత్త సంస్థలను ప్రోత్సహించే విధంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. 5/20 నిబంధనను రద్దు చేయాలన్న ఆలోచనపై చెలరేగుతున్న వివాదంపై స్పందిస్తూ... పరిశ్రమ వృద్ధిని నియంత్రించే చర్యలను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తానన్నారు. ఐదేళ్లు దేశీయంగా విమానాలు నడిపి, కనీసం విమానాల సంఖ్య 20 వున్న సంస్థలకే విదేశీ సర్వీసులు నిర్వహించేందుకు అనుమతివ్వడానికి నిర్దేశించిన నిబంధనను 5/20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పౌర విమానయానరంగంలో వృద్ధి బాగానే ఉందని, సరుకు రవాణాలో కూడా వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం సమీపంలో నిర్మించతలపెట్టిన భోగాపురం ఎయిర్‌పోర్టు ఇంకా పరిశీలన దశలోనే ఉందని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement