ఒక్క రోజే 20 కేజీల బంగారం విక్రయం | Sakshi
Sakshi News home page

ఒక్క రోజే 20 కేజీల బంగారం విక్రయం

Published Fri, Apr 20 2018 8:06 PM

Paytm Sees 3 Fold Jump In Gold Sales On Akshaya Tritiya - Sakshi

న్యూఢిల్లీ : అక్షయ తృతీయ సందర్భంగా జువెల్లరీ దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడాయి. ఇటు మొబైల్‌ వాలెట్లు సైతం భారీ అమ్మకాలను నమోదుచేశాయి. ప్రముఖ మొబైల్ వాలెట్‌ పేటీఎం అక్షయ తృతీయ సందర్భంగా తన బంగారం విక్రయాలను మూడు రెట్లు పెంచుకుంది. దీంతో  ఒక్క రోజే(ఏ‍ప్రిల్‌ 18న) 20 కేజీల బంగారాన్ని విక్రయించినట్టు తెలిపింది. బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావించే అక్షయ తృతీయ రోజున అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని పేటీఎం వెల్లడించింది. ఎక్కువగా అమ్మకాలు బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా నగరాల్లో నమోదైనట్టు తెలిపింది.

ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై 1.5 మిలియన్లకు పైగా కస్టమర్లు 20 కేజీల బంగారాన్ని కొన్నారని, ఎక్కువగా 24 క్యారెట్‌ బంగారు నాణేలను కొనుగోలు చేసినట్టు పేటీఎం తెలిపింది. గతేడాది ఇదే రోజు 6.5 కేజీల బంగారాన్ని మాత్రమే విక్రయించినట్టు పేర్కొంది.  రానున్న నెలల్లో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియాను మరింతగా విస్తరించనున్నామని పేటీఎం సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ నితిన్‌ మిశ్ర చెప్పారు. పేటీఎం తన కస్టమర్ల బంగారాన్ని ఎంఎంటీసీ-పీఏఎంపీతో బీమా లాకెట్లలో ఉంచుతోంది. వీటిపై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. ఎప్పుడు కావాల్సి వస్తే, అప్పుడు డెలివరీ చేస్తోంది.  
 

Advertisement
Advertisement