నీరవ్‌ మోదీపై భారీ ఎత్తున కొరడా

Nirav Modi bank accounts properties attach - Sakshi

న్యూఢిల్లీ : పీఎన్‌బీ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా కొరడా ఝుళిపిస్తున్నారు. నిన్న కాక మొన్ననే రూ.5100 కోట్ల వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీబీఐ అధికారులు సీజ్‌ చేయగా.. నేడు ఆదాయపు పన్ను శాఖ కూడా ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్‌ చేసింది. పన్ను ఎగవేత విచారణ కింద నీరవ్‌ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, సంస్థలకు చెందిన 29 ఆస్తులను, 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్‌ చేసినట్టు  ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాక విదేశాల్లో ఆయన అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపిస్తూ... ఆయనపై యాంటీ-బ్లాక్‌ మనీ యాక్ట్‌ను ప్రయోగించారు. 

ఈ ఆస్తులు సింగపూర్‌లో ఉన్నట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కొత్త చట్టం కింద లెక్కలో చూపించని విదేశీ ఆస్తులు, ఆదాయంపై 120 శాతం పన్ను వేస్తారు. అంతేకాక 10 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్స్‌ 276 సీ(1), 277 ఏ, 278 బీ, 278 ఈ కింద మోదీకి వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27 ఈ కేసును కోర్టు విచారించనుంది. సూరత్‌, ముంబై, జైపూర్‌, ఢిల్లీలో ఉన్న నీరవ్‌ మోదీ, ఆయన భార్య ఆమీ, సంస్థలకు చెందిన స్థిరాస్తులకు పన్ను అధికారులు ఈ అటాచ్‌మెంట్‌ నోటీసు పంపారు. మోదీ, ఆయన కుటుంబం, కంపెనీలకు చెందిన మొత్తం 105 బ్యాంకు అకౌంట్లను అటాచ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మోదీకి మొత్తం 150 షెల్‌ కంపెనీలతో లింక్‌లున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్‌ కుంభకోణానికి నీరవ్‌మోదీ పాల్పడ్డ సంగతి తెలిసిందే. పీఎన్‌బీ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల స్కాంకు పాల్పడి, ప్రస్తుతం విదేశాలకు పారిపోయారు. ఈయనను పట్టుకోవడం కోసం సీబీఐ, ఈడీ అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. 
 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top