దీనివల్ల ఇన్వెస్టర్లకు 60వేల కోట్లు లాస్‌ | ITC Share Price Plunges 15%, Investors Lose Nearly Rs. 60,000 Crore | Sakshi
Sakshi News home page

దీనివల్ల ఇన్వెస్టర్లకు 60వేల కోట్లు లాస్‌

Jul 18 2017 4:18 PM | Updated on Sep 5 2017 4:19 PM

దీనివల్ల ఇన్వెస్టర్లకు 60వేల కోట్లు లాస్‌

దీనివల్ల ఇన్వెస్టర్లకు 60వేల కోట్లు లాస్‌

సిగరెట్‌ ఉత్పత్తులపై సెస్‌ను పెంచుతున్నట్టు ప్రకటించిన జీఎస్టీ కౌన్సిల్‌‌, సిగరెట్‌ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ ఐటీసీకి షాకిచ్చింది.

ముంబై : సిగరెట్‌ ఉత్పత్తులపై సెస్‌ను పెంచుతున్నట్టు ప్రకటించిన జీఎస్టీ కౌన్సిల్‌‌, సిగరెట్‌ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ ఐటీసీకి షాకిచ్చింది. ఈ షాక్‌కు ఇన్వెస్టర్లందరూ ఒక్కసారిగా అమ్మకానికి పోటెత్తారు. దీంతో ఐటీసీ కంపెనీ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో అతిపెద్ద పతనాన్ని నమోదుచేస్తూ 15 శాతం మేర క్రాష్‌ అయ్యాయి. ఈ క్రాష్‌తో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3.37 లక్షల కోట్లకు పడిపోయింది. సోమవారం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3.96 లక్షల కోట్లు. అంటే దాదాపు రూ.60వేల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఐటీసీ దెబ్బ ఇటు స్టాక్‌ మార్కెట్లకు భారీగానే కొట్టింది. సెన్సెక్స్‌ ఈ ఏడాదిలో అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. స్టాక్‌ మార్కెట్‌లో హై వెయిటేజీ ఉన్న షేర్లలో ఐటీసీ ఒకటి. నిఫ్టీలో కూడా ఇదే రెండో అతిపెద్ద వెయిటేజీ సంస్థ. 

 
బ్లూబర్గ్‌ రిపోర్టు ప్రకారం ఐటీసీ షేర్లు 25 ఏళ్లలో అతిపెద్ద నష్టాలను నమోదుచేశాయని తెలిసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే 28 శాతం పన్నుతో పాటు, అదనంగా పరిహారాల సెస్‌ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో అదనంగా 5 శాతం సెస్‌ను ఆమోదించారు. ఇది సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. దీంతో మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన దగ్గర్నుంచే ఐటీసీ షేర్లు భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రభుత్వం పెంచిన పన్నుతో సిగరెట్‌ ఉత్పత్తుల ఎంఆర్‌పీ ధరలు కూడా 8-9 శాతం పెరగనున్నాయని దేశీయ బ్రోకరేజ్‌ సంస్థలు చెప్పాయి. అంతేకాక స్టాక్‌ను డౌన్‌గ్రేడ్‌ కూడా చేస్తున్నాయి. నేటి ట్రేడింగ్‌ చివరికి ఐటీసీ షేర్లు 12.63 శాతం నష్టంలో రూ.284.60 వద్ద ముగిశాయి.
Advertisement
 
Advertisement
Advertisement