ప్రకృతి రమణీయతకు మారుపేరుగా, అందమైన ఉద్యానవనాలతో ప్రధాన ఆకర్షణగా ఉండే అద్భుతమైన రాష్ట్రపతి భవనం స్మార్ట్ టౌన్ షిప్ గా రూపొందనుంది.
న్యూఢిల్లీ : ప్రకృతి రమణీయతకు మారుపేరుగా, అందమైన ఉద్యానవనాలతో ప్రధాన ఆకర్షణగా ఉండే అద్భుతమైన రాష్ట్రపతి భవనం, ఐబీఎమ్ స్మార్ట్ సిటీ సొల్యూషన్ సహకారంతో స్మార్ట్ టౌన్ షిప్ గా రూపొందనుంది. స్మార్ట్ సిటీ సొల్యూషన్ లో భాగంగా ప్రెసిడెన్సియల్ ఎస్టేట్ లో డిజిటల్ ట్రాన్సపర్ మేషన్ ను చేపట్టనున్నట్టు ఐబీఎమ్ గురువారం ప్రకటించింది. 330 ఎకరాల విస్తీర్ణాన్ని, 5వేల పైగా రెసిడెంట్లను, అధ్యక్ష ఎస్టేట్ ను భవిష్యత్తులో స్మార్ట్ గా రూపుదిద్దడానికి ఐబీఎమ్ టెక్నాలజీ సహాయపడనుంది.
నీళ్ల సరఫరా, భద్రతా, విద్యుత్ అవస్థాపన, ఘన వ్యర్థాల నిర్వహణను సవాళ్లగా తీసుకుంటూ టౌన్ షిప్ ను అభివృద్ధి చేస్తామని ఐబీఎమ్ పేర్కొంది. ఇప్పటికే ఐబీఎమ్ ఇంటిలిజెన్స్ ఆపరేషన్ సెంటర్(ఐఓఎస్) సిటిజన్స్ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది. వెబ్, మొబైల్ ద్వారా సమస్యలను తెలియజేసేలా దీన్ని రూపొందించింది. డిజిటల్ యుగంలో రాష్ట్రపతి భవన్ కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఓ ఈవెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత స్మార్ట్ సిటీ విజన్ కు రాష్ట్రపతి భవనం సారుప్యంగా మారుస్తామని, ఈ స్మార్ట్ టౌన్ షిప్ గ్రేట్ జర్నీలో తాము భాగస్వామ్యమైనందుకు చాలా గర్వంగా భావిస్తున్నామని భారత ఐబీఎమ్ ఎండీ వనిత నారాయణన్ అన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
