రిలయన్స్‌ జియోవైపు గూగుల్‌ చూపు!

Google may invest in Reliance jio: market expectations - Sakshi

జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి యోచన

4 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌!

కొద్ది వారాలలో వివరాలు తెలిసే చాన్స్‌

అంచనా వేస్తున్న మార్కెట్ వర్గాలు

ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను సైతం ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు డిజిటల్‌, టెలికం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4 బిలియన్‌ డాలర్లు(రూ. 30,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో గూగుల్ ఉన్నట్లు మార్కెట్లో వినిపిస్తోంది. చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ డీల్‌ కొద్ది వారాలలో వెల్లడికావచ్చని మార్కెట్‌ వర్గాలు ఊహిస్తున్నాయి. రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళిల్లో ఉన్నట్లు సోమవారం గూగుల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా డిజిటల్‌ టెక్నాలజీస్‌లో మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో జియోలో పెట్టుబడులపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే  ఈ అంశంపై అటు ఆర్‌ఐఎల్‌, ఇటు గూగుల్‌ స్పందించకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 1 శాతం బలహీనపడి రూ. 1915 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1942 వద్ద గరిష్టాన్నీ, రూ. 1887 వద్ద కనిష్టాన్నీ తాకింది.

క్వాల్‌కామ్‌తో..
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ కంపెనీ ఆర్‌ఐఎల్‌కు అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. తద్వారా జియోలో 0.15 శాతం వాటాను సొంతం చేసుకుంది.  జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ. 1.18 లక్షల కోట్లకుపైగా సమీకరించింది.  జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌సహా చిప్‌ దిగ్గజాలు ఇంటెల్‌, క్వాల్‌కామ్‌.. పీఈ సంస్థలు కేకేఆర్‌, సిల్వర్‌ లేక్‌ తదితరాలు ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ పెట్టుబడులకు జతగా రైట్స్‌ ఇష్యూ ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ. 53,124 కోట్లను సమకూర్చుకుంది. ఈ బాటలో గతేడాది ఇంధన రిటైల్‌ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు గత నెలలో ఆర్‌ఐఎల్‌ తెలియజేసింది. మార్చికల్లా ఆర్‌ఐఎల్‌ రుణ భారం రూ. 1.6 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top